అక్షరటుడే, కామారెడ్డి: Adulterated Toddy | జిల్లాలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతోంది. నిషేధిత మత్తు పదార్థాలతో డిపోల నిర్వాహకులు కల్లు తయారు చేస్తున్నారు. అల్ప్రాజోలం, డైజోఫామ్ వంటి రసాయనాలతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇవి తాగుతున్న ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. అసలు ఈత, తాటి చెట్లు లేకున్నా.. కల్లు తయారు చేసి అమ్ముతున్నారంటే కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో నిషేధిత మత్తు పదార్థాల సరఫరా చాపకింద నీరులా జోరుగా సాగుతోంది. అల్ప్రాజోలం, డైజోఫాం, ఇతర మత్తు పదార్థాలు బహిరంగంగానే దిగుమతి చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాను వ్యాపారంగా మార్చుకున్న కొందరు వ్యక్తులు అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి దర్జాగా అనుకున్న ప్రాంతాలకు డంప్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్న అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో సంబంధిత శాఖలు పూర్తిగా విఫలం అవుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
Adulterated Toddy | వ్యసనంగా…
కల్తీ కల్లును గ్రామాల్లో సీసాకు రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో దీని ధర అధికంగా ఉంది. అయితే కూలీ పనులు చేసే వారు, రైతులు, కార్మికులు రోజంతా కష్టపడి పని చేసి.. ఆ అలసట మర్చిపోవడానికి కల్లు తాగుతున్నారు. అయితే ఇందులో మత్తు పదార్థాలు కలపడంతో వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాంతులు, గుండె దడ, తలనొప్పి, స్పృహ కోల్పోవడం సాధారణం అయ్యింది. గత మూడు నెలల్లో ఆస్పత్రులకు ఇలాంటి లక్షణాలతో పదుల సంఖ్యలో కేసులు వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ కల్లు తాగేవారు బానిసలుగా మారుతున్నారు. ఒకవేళ కల్లు దొరకకపోతే పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు.
Adulterated Toddy | చాపకింద నీరులా
జిల్లాలో అల్ర్పాజోలం, డైజోఫాం సరఫరా నెట్‌వర్క్ విస్తృతంగా ఉంది. పట్టణ శివారుల్లోని అద్దె గోడౌన్లు, గ్రామీణ దుకాణాల వెనుక గదులు, వ్యవసాయ బావుల పక్కన ఉన్న షెడ్లు ఇందుకు కేంద్రాలుగా మారాయి. కొద్దిమంది వ్యక్తులు ఈ అక్రమ వ్యాపారాన్ని సిండికేట్‌గా నడుపుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి కేసు నమోదు చేసి వదిలేస్తుండటంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందన్న విమర్శలున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ నిషేధిత మత్తు పదార్థాలను వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Adulterated Toddy | నిఘా వైఫల్యమా
పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఫిర్యాదు వస్తే తప్ప దాడులు చేయడం లేదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గస్తీ, తనిఖీలు కాగితాలకే పరిమితమయ్యాయా అనే అనుమానం తలెత్తుతోంది. జిల్లాలో 276 లైసెన్స్ ఉన్న కల్లు దుకాణాలు, 23 కల్లు డిపోలు, 66 సొసైటీలు ఉన్నాయి. గత ఆరు నెలల్లో జరిగిన తనిఖీల సంఖ్య పదుల సంఖ్య కూడా దాటలేదని తెలుస్తోంది. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి జరుగుతున్న ఈ దందాను కట్టడి చేయడంలో సంబంధిత శాఖలు పూర్తిగా విఫలమయ్యాయన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
Adulterated Toddy | నార్కోటిక్ విభాగం ఎంట్రీతో ఇద్దరి అరెస్ట్
నార్కోటిక్ విభాగం రంగంలోకి దిగి తాజాగా ఇద్దరు అక్రమ వ్యాపారులను అరెస్ట్ చేసింది. సంబంధిత గ్రామంలోని దుకాణంలో కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో నార్కోటిక్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో దుకాణంలో కల్లులో కల్తీ జరిగినట్టు అధికారులు నిర్దారించి కొన్ని కల్లు సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కల్తీ కల్లు దందాను అరికట్టాలని కోరుతున్నారు.
మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెట్టాం
– ముకుంద రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ కామారెడ్డి
జిల్లాలో తయారవుతున్న కల్లులో మత్తు పదార్థాలు కలుపుతున్నారు అనడానికి ఆధారాలు లేకుండా పోతున్నాయి. వాటి నిర్దారణ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. గత జులై నెలలో 102 శాంపిల్స్ సేకరించి పంపించాం. ఆల్ఫ్రాజోలం లాంటి మత్తు పదార్థాలు ఎక్కడినుంచి వస్తున్నాయనే దానిపై ప్రత్యేక నిఘా పెట్టాం. కల్తీ కల్లు విక్రయించే వారితో పాటు నిషేధిత మత్తు పదార్థాలు వాడుతున్న వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం
ఇది కూడా చదవండి..: Ashadam Friday | ఆషాఢం చివరి శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు..