BJP Jana Sena Telangana | తెలంగాణ రాజకీయం హాట్ హాట్.. జనసేన గూటికి చేరిన బీజేపీ కీలక నేతలు

తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు, చేరికల అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BJP Jana Sena Telangana | తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు, చేరికల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్డీయే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన మధ్య నెలకొన్న తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించగా.. ఇది ఆయన పరిధిలోని అంశం కాదని, పొత్తులపై పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల యుద్ధం చల్లారకముందే, మిత్రపక్షమైన బీజేపీకి జనసేన గట్టి షాకిచ్చింది. బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరడం కమలం శిబిరంలో కలకలం రేపుతోంది.

BJP Jana Sena Telangana | బీజేపీ నేతల చేరికలు..

తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ, సంస్థాగత బలోపేతంతో పాటు చేరికలపై వేగం పెంచింది. ఇందులో భాగంగా ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )సమక్షంలో 16 మంది నేతలు ఆ పార్టీలో చేరారు. వీరిలో నలుగురు బీజేపీ , దాని అనుబంధ సంఘాలకు చెందినవారు ఉండటం గమనార్హం. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత హైందవి రెడ్డి పాండెం, సనత్ నగర్‌కు చెందిన అనిల్ గీడికపల్లి, రవి టెండూల్కర్, అలాగే బీజేపీ యువజన మోర్చాకు చెందిన ఇల్లందు నేత గొగ్గల నాగ శ్రావంతి జనసేన కండువా కప్పుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యంత మిత్రపక్షంగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో మాత్రం తమ సొంత నేతలను చేర్చుకోవడం బీజేపీ క్యాడర్‌ను విస్మయానికి గురిచేస్తోంది.

BJP Jana Sena Telangana | అందరినీ ఒక్కతాటిపైకి ..

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర స్థాయి నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఒక్కటయ్యారనే ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో, జనసేన చర్యలు కమలం పార్టీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి.

BJP Jana Sena Telangana | సొంత నేతలే మిత్రపక్ష గూటికి..

మరోవైపు, ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి చేర్చుకోవాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తుంటే.. సొంత నేతలే మిత్రపక్ష గూటికి చేరడం వెనుక అసలు కారణాలపై విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. బీజేపీపై నమ్మకం సడలడం వల్లనే నేతలు పార్టీ వీడుతున్నారా? లేక అక్కడ భవిష్యత్ ఉండదన్న ఉద్దేశంతో జనసేన వైపు చూస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత జనసేన రాష్ట్రంలో దూకుడు పెంచడం గమనించదగ్గ విషయం. మొత్తానికి, ఈ పరిణామాలు భవిష్యత్తులో బీజేపీ-జనసేన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కాలమే నిర్ణయించాలి.

ఇది కూడా చదవండి: Air India Pilot Dope Test | ఎయిర్ ఇండియా పైలట్‌కు డోప్ టెస్ట్ పాజిటివ్.. విధులకు దూరం పెట్టిన యాజమాన్యం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *