Smart Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. 1.06 కోట్ల స్మార్ట్​కార్డులు

స్మార్ట్​ రేషన్​ కార్డుల పంపిణీని సీఎం రేవంత్​రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | రాష్ట్రంలో రేషన్​కార్డుల రూపు మారనుంది. కొత్తగా స్మార్ట్​ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న ఈ కార్డుల పంపిణీని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డులు పంపిణీ చేయక చాలా ఏళ్లు అవుతోంది. ఇటీవల ప్రభుత్వం కొత్తకార్డులు ఇచ్చింది. పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే భౌతికంగా కొత్తకార్డులు మాత్రం పంపిణీ చేయలేదు. ప్రస్తుతం ప్రజలు పాతకార్డులు, ఆన్​లైన్​ తీసుకున్న ప్రింట్ ఆధారంగా రేషన్​ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సంగారెడ్డి (Sangareddy)లో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Smart Ration Cards | ఏర్పాట్లపై సమీక్ష

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోనూ మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 రేషన్​ కార్డులు ఉన్నాయని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.

Smart Ration Cards | 16.32 లక్షల కొత్త కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.