అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానాల్లో తగినన్ని మందులు, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే క్రమంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా అండగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్రైవర్లకు జీవిత బీమా చేయించినట్లు తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Harish Rao | ప్రభుత్వం కక్ష సాధింపు..
సిద్దిపేట (Siddipet) అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని హరీష్ రావు ఆరోపించారు. వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, శిల్పారామం, రైల్వే బ్రిడ్జి, టూరిజం ప్రాజెక్టుల పనులు గత మూడేళ్లుగా ఎక్కడికక్కడే నిలిచిపోయి మొండి గోడలతో దర్శనమిస్తున్నాయని విమర్శించారు. కలెక్టరేట్ సమీపంలో సగం వరకు నిర్మించిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలించుకుపోయారని మండిపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిపోయిన పనులన్నింటినీ రెట్టింపు వేగంతో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిత్యం వాకింగ్‌తో పాటు వీలున్న వారు యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: KTR Welfare Schemes | అధికారం శాశ్వతం కాదు.. ప్రజలకు మంచి చేయడమే ముఖ్యం: కేటీఆర్