Armoor Municipal Corruption | ఆర్మూర్​ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..

ఆర్మూర్​ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోంది. చిరుద్యోగులను టార్గెట్​ చేసుకున్న ఓ బడా ఉద్యోగి హాజరు పేరుతో వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడనే చర్చ సాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipal Corruption | ఆర్మూర్​ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోంది. చిరుద్యోగులను టార్గెట్​ చేసుకున్న ఓ బడా ఉద్యోగి హాజరు పేరుతో వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందా ప్రస్తుతం బల్దియాలో హాట్​ టాపిక్​గా మారింది.

Armoor Municipal Corruption | బల్దియాలోని ముఖ్య విభాగంలో..

ఆర్మూర్ మున్సిపాలిటీలో (Armoor Municipality) రెవెన్యూ, శానిటేషన్​, ఇంజినీరింగ్​, టౌన్​ప్లానింగ్​ ఇలా పలు విభాగాలు ఉంటాయి. ఇందులో ఓ విభాగానికి చెందిన అధికారి అదే మున్సిపాలిటీలో పనిచేసే ఓ నాల్గో తరగతి ఉద్యోగిని డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగి ప్రతినిత్యం విధులకు హాజరవుతున్నప్పటికీ నెలకు కచ్చితంగా తనకు రూ.20వేలు ఇవ్వాలని లేకుంటే హాజరు వేయనని, ఉద్యోగంలో నుంచి తీసివేయిస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు ఉద్యోగి ఆర్నెళ్లుగా ప్రతినెలా రూ.20వేల చొప్పున అధికారికి ఇస్తూ వచ్చినట్లు తెలిసింది. తనను అధికారి వేధింపులకు గురి చేయడంతో ఏమి చేయాలని పరిస్థితుల్లో సదరు ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎక్కడ అధికారిపై ఫిర్యాదు చేస్తే అంతా నన్ను పగపడతారోనని.. పదవీ విరమణ దగ్గర పడుతున్న సమయంలో అధికారులతో పెట్టుకోవడం ఎందుకని తనలో తానే కుమిలిపోతున్నాడు.

Armoor Municipal Corruption | అలాంటేదేమీ లేదు..

కాగా.. సదరు అధికారిని ‘అక్షరటుడే’ ఈ వ్యవహారంపై సంప్రదించగా అలాంటిదేమీ లేదని ఆ ఉద్యోగిని పిలిపిస్తే నేను మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. అనంతరం ఆ అధికారి చిరుద్యోగిని కలిసి ఇప్పటినుంచి తనను కలవొద్దని.. ఏమీ ఇవ్వవద్దని చెప్పినట్లు సమాచారం. ఇప్పటినుంచి తనకు ఏం ఇవ్వవద్దని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ అప్పటివరకు ఇచ్చిన డబ్బుల సంగతి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సదరు ఉద్యోగి బారిన పడిన వారు ఇంకా చాలామంది ఉన్నట్లు సమాచారం.

Armoor Municipal Corruption | నా దృష్టికి రాలేదు..

– శ్రీహరి రాజు, మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్

ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకునే విషయం తన దృష్టికి రాలేదు. లిఖిత పూర్వకంగా రాసిస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. సదరు ఉద్యోగి తనను వచ్చి కలిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటాను. బల్దియాలో అవినీతికి తావులేకుండా చేస్తాను.

ఇది కూడా చదవండి..: Govindpet Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *