అక్షరటుడే, నిజామాబాద్: Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్ (Nizamabad)లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఉన్న ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం ఎంపికైంది. ఈ విషయాన్ని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ సీఈవో కె. సంతోష్ కుమార్ తెలిపారు.
సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తమ ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం ఎంపిక కావడం సంస్థకు, జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌కు ఎంపికైన ఏకైక ప్రైవేట్ ఇండోర్ స్టేడియంగా కేళ్ భారతి నిలిచిందని పేర్కొన్నారు. యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు జాతీయ స్థాయి క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి తమ క్రీడా మౌలిక వసతులు ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడలను విద్యలో అంతర్భాగంగా మార్చాలన్న తమ లక్ష్యానికి ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపారు. ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు, క్రీడాకారులకు అవసరమైన వసతి, ఆతిథ్య ఏర్పాట్లను కల్పిస్తామని సంతోష్ కుమార్ చెప్పారు.
Khelo India Youth Games | ఆధునిక క్రీడా సముదాయం
ఖేల్ భారతి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినట్లు సంతోష్ కుమార్ తెలిపారు. అన్ని కాలాల్లోనూ క్రీడా శిక్షణకు అనువుగా ఉండే ఈ సముదాయంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఎయిర్ రైఫిల్/పిస్టల్ షూటింగ్, చెస్, క్యారమ్, ఫిట్‌నెస్, స్ట్రెంగ్త్ కండిషనింగ్ వంటి క్రీడలకు శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా సుమారు 500 మంది ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ, బాలురు, బాలికలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు, చేంజింగ్ రూమ్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. సర్టిఫైడ్ కోచ్‌ల ఆధ్వర్యంలో క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడేలా యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని సంతోష్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Midday Meals | అధ్వానంగా మధ్యాహ్న భోజనం.. విద్యార్థుల ఇబ్బందులు