Midday Meals | అధ్వానంగా మధ్యాహ్న భోజనం.. విద్యార్థుల ఇబ్బందులు

ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం లేదు. దీంతో విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Midday Meals | ప్రభుత్వ పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం చూడటానికి సన్నబియ్యం మాదిరిగానే ఉన్నప్పటికీ వండితే మాత్రం దొడ్డు బియ్యం వండినట్టుగా మారుతోంది.

జిల్లాలోని పలు పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బియ్యంలో అత్యధికంగా నూక కనిపిస్తోంది. అలాగే అనేక సంచుల్లో తెల్లటి పురుగులు దర్శనమిస్తున్నాయి. వాటిని సరిచేసి వంట చేయడానికి మధ్యాహ్న భోజనం వండే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి పరిస్థితులు నెలకొంటున్నాయి.

Midday Meals | చూడటానికే సన్నబియ్యం

జిల్లాలోని పలు పాఠశాలలు, అంగన్​వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న బియ్యం పరిస్థితిని పరిశీలిస్తే దారుణం కనిపిస్తోంది. బస్తాల్లో బియ్యం చూడటానికి సన్నబియ్యం మాదిరిగానే మెరుస్తోంది. కానీ వండిన తర్వాత మాత్రం పూర్తిగా దొడ్డు బియ్యం మాదిరిగా మారుతోంది. అన్నం ముద్దగా మారకున్నా చూడటానికి దొడ్డు బియ్యం వండినట్టుగా ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో తినడానికి అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు సరిగా తినకుండానే ప్లేట్లలో వదిలేస్తున్నారు. సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Midday Meals | నూకలు, పురుగులతో అవస్థలు

సరఫరా అవుతున్న బియ్యంలో అత్యధికంగా నూక శాతం ఉంటోంది. అంతేకాకుండా అనేక బస్తాల్లో తెల్లటి పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిని జల్లెడ పట్టి, ఏరి శుభ్రం చేసి వంట చేయాలంటే మధ్యాహ్న భోజనం వండే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుభ్రం చేయడానికే గంటల సమయం వృథా అవుతుండటంతో సకాలంలో విద్యార్థులకు భోజనం అందించలేకపోతున్నారు. ఈ నాణ్యత లేని బియ్యంతో వండిన అన్నం తింటే చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Midday Meals | పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

ఈ విషయంపై పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగన్​వాడీ టీచర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Nizamabad Mayor Uma Rani | నిజామాబాద్‌ మేయర్‌ ఉమారాణికి మాతృవియోగం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *