Kaleshwaram Verdict | కాళేశ్వరం తీర్పు.. కాంగ్రెస్‌కు చెంపపెట్టు..!

shashi kiran Mottala

అక్షరటుడే, ​భీమ్‌గల్: Kaleshwaram Verdict | కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డికి (CM revanth Reddy) గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ భీమ్‌గల్ మండల నాయకులు పేర్కొన్నారు. భీమ్‌గల్‌(Bheemgal)లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ఇతర నాయకులతో కలిసి మాట్లాడారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ రైతాంగ విజయమని వారు అభివర్ణించారు.

Kaleshwaram Verdict | ​అబద్ధాల పునాదులు కూలిపోయాయి..

​గత రెండేళ్లుగా కాళేశ్వరంపై(Kaleshwaram) రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ తీర్పు పటాపంచలు చేసిందని బీఆర్​ఎస్​​ నాయకులు అన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ.94 వేల కోట్లు అయితే.. రూ.లక్ష కోట్ల అవినీతి అనడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు.. ప్రాజెక్టులో భాగమైన 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్‌లు, వందల కిలోమీటర్ల సొరంగాలు కేసీఆర్(KCR) దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.

Kaleshwaram Verdict | ​రివర్స్ పంపింగ్‌తోనే రైతులకు జలసిరి..

​ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో (SRSP Revitalization Scheme) భాగంగా చేపట్టిన రివర్స్ పంపింగ్ లేకపోతే ఈ వేసవిలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోయేవని నాయకులు గుర్తుచేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో కప్పల వాగు నిండటం వల్లే నేడు భీమ్‌గల్ పట్టణంలో తాగు, సాగునీటికి కొరత లేదని స్పష్టం చేశారు. రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చిన నీటితోనే మే నెలలోనూ వాగులు కళకళలాడుతున్నాయని, దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Kaleshwaram Verdict | ​రాజకీయ లబ్ధి కోసం కుట్రలు..

​మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లు కుంగితే, వాటిని బాగు చేయకుండా ప్రాజెక్టును నిరుపయోగం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తోసిపుచ్చడంతోనైనా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చౌటుపల్లి రవి, శర్మ నాయక్, మోయీజ్, శ్రీనివాస్, ప్రకాష్, కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, నర్సయ్య, భగత్, రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Oppo F33 | ఒప్పో నుంచి మరో క్రేజీ ఫోన్..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *