అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | వివాదాలు, ఆందోళనలకు కామారెడ్డి బల్దియా వేదికగా మారుతోంది. నూతన పాలకవర్గం ఏర్పాటైన నాటి నుంచి బల్దియాను వివాదాలు వీడటం లేదు. పట్టణ అభివృద్ధిపై (Kamareddy) జరగాల్సిన ప్రతి సమావేశం రసాభాసగా మారి వాయిదా పర్వానికి చేరుతోంది. ఫలితంగా ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. పట్టణ అభివృద్ధి కుంటు పడుతోంది.
Kamareddy Municipality | పట్టణంలో 49 వార్డులు..
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బల్దియాలో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తో కుదిరిన ఒప్పందంతో అధికార పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోగా, బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. బయటకు మిత్రులుగా కనిపిస్తున్నా లోపల మాత్రం మూడు పార్టీలు మూడు దారుల్లో నడుస్తున్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కో విధానంతో వెళ్తుండటంతో బల్దియా మూడు ముక్కలాటగా మారింది. ఒక్కో పార్టీ తన బలం చూపుకునేందుకు కౌన్సిల్ సమావేశాన్నే వేదికగా మార్చుకుంటోంది.
Kamareddy Municipality | అభివృద్ధిపై పట్టింపు లేని నాయకులు
రాజకీయ ఆధిపత్య పోరులో పట్టణ అభివృద్ధి పూర్తిగా మరుగున పడిపోయింది. రోడ్లు గుంతలమయం, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా, పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే నాథుడే లేడు. తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రజల నిత్యావసర సమస్యలపై చర్చ జరగడం లేదు. కౌన్సిల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు తమ వర్గ ప్రయోజనాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపుల చుట్టూనే తిరుగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి కంటే ఆధిపత్యమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలకవర్గానికి పట్టణ ప్రజల సమస్యలపై, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్న అపవాదు బలంగా వినిపిస్తోంది.
Kamareddy Municipality | ఆందోళనతో వాయిదాల పర్వం
బల్దియాలో జరిగే ప్రతి కౌన్సిల్ సమావేశం గందరగోళంతోనే ప్రారంభమవుతోంది. ఎజెండా అంశాలను చదివి వినిపించేలోపే నినాదాలు, ఆందోళనలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు మైకులు లాక్కోవడం, పేపర్లు చించేయడం, చైర్పర్సన్ కుర్చీని చుట్టుముట్టడం పరిపాటిగా మారింది. అధికారులు నిబంధనలు చెప్పినా వినే పరిస్థితి లేదు. చివరకు చైర్పర్సన్ సమావేశాన్ని మధ్యలోనే వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బల్దియా సమావేశం అంటేనే హైడ్రామా అన్నట్లుగా తయారైంది.
మూడు సమావేశాలు వాయిదా..
నూతన పాలకవర్గం కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు జరిగిన మూడు కౌన్సిల్ సమావేశాలు కూడా ఎలాంటి తీర్మానాలు ఆమోదించకుండానే వాయిదా పడ్డాయి. ఒక్క అంశంపై కూడా కౌన్సిల్ ఆమోద ముద్ర పడలేదు. కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా, కొనుగోళ్లు, పారిశుధ్య పనులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి. దీంతో అధికారులు సిద్ధం చేసిన అభివృద్ధి ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమవుతున్నాయి. వరుస వాయిదాలతో పాలన స్తంభించిపోయిందని, కామారెడ్డి ప్రజలు బల్దియా తీరుపై మండిపడుతున్నారు.
రేపటి సమావేశంపై ఉత్కంఠ..
ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు మరోసారి ధైర్యం చేసి 9 కీలక అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. స్వచ్ఛభారత్ నిధులతో మిషనరీ కొనుగోలు, మురుగు దొడ్ల నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులతో స్వచ్ఛ ఆటోలు, ఈవీ ఆటోలు, డోజర్ల కొనుగోలు, 49 వార్డుల్లో ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి యూజర్ చార్జీల వసూలు, నాన్ వెజ్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక టెండర్లు, భారీ వర్షాల సమయంలో చేపట్టిన అత్యవసర జేసీబీ పనుల బిల్లుల చెల్లింపు, వినాయక చవితి ఉత్సవాలు, పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లకు నిధులు, వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహణ వంటి ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి.
చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూళ్లతో కొత్తలొల్లి
తాజా ఎజెండాలోనే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు మున్సిపాలిటీనే ఉచితంగా చేస్తున్న చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి, ప్రజల నుంచి నెలనెలా యూజర్ చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు కౌన్సిల్లో కొత్త లొల్లికి కారణమవుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం మోపితే తీవ్ర వ్యతిరేకత వస్తుందని పలువురు కౌన్సిలర్లు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి నిధులున్నా వాడుకోలేని పాలకవర్గం, మరోవైపు ప్రజల జేబులకు చిల్లు పెట్టే యూజర్ చార్జీల ఆలోచనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేపటి సమావేశంలో ఈ అంశంపై పెద్ద దుమారమే లేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికైనా పార్టీల జెండాలు పక్కన పెట్టి పట్టణ అభివృద్ధి జెండా ఎగురవేస్తారా? లేక రేపటి సమావేశం కూడా ఆందోళనలు, వాయిదాలతో ముగుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ‘వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడేంటి..’