Konda Surekha Rakhi | నన్ను సపరేట్ చేయకండి .. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు!

రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, మరో మహిళా మంత్రి సీతక్క జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha Rakhi | రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ( Revanth Reddy ) మంత్రి కొండా సురేఖ, మరో మహిళా మంత్రి సీతక్క జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఇద్దరు మంత్రులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భరోసా, ఆత్మీయత, ప్రేమ, అనురాగం, గౌరవానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహిళ జీవితంలో తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు వంటి పురుషుల భాగస్వామ్యం ఉంటుందని, వారి నుంచి లభించే రక్షణ, భరోసా మహిళకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అన్న, తమ్ముడిపై నమ్మకంతో రాఖీ కట్టి, తనకు రక్షణగా ఉండాలని కోరుకోవడమే రక్షాబంధన్‌లోని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Konda Surekha Rakhi | నన్ను సపరేట్ చేయకండి..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ.. తెలంగాణలో మహిళలందరి తరఫున ఆయనకు తమ ఆశీర్వాదం ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ “నన్ను సపరేట్ చేయకండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలోని ప్రతి ఆడపడుచుకు ప్రతినిధినని, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల మహిళలకు సీఎం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Konda Surekha Rakhi | రాజకీయ ప్రాధాన్యత..

ఇటీవల పరకాల అసెంబ్లీ సీటు విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లు ఆమె కుటుంబంపై బహిరంగంగా విమర్శలు చేయడం, మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండా సురేఖ స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం రాజకీయ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Konda Surekha Rakhi | సీఎం రేవంత్​రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *