అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | కామారెడ్డి బల్దియా కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మూడు పార్టీల కౌన్సిలర్లు సంయమనం కోల్పోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సమావేశాన్ని రణరంగంలా మార్చారు.
Kamareddy Municipal Meeting | 9 అంశాలతో..
కామారెడ్డి మున్సిపల్ సమావేశాన్ని ముఖ్యమైన 9 అంశాలతో శనివారం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పోడియం వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు. పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కౌన్సిలర్ హఫీజ్ ప్రశ్నిస్తుండగా కాంగ్రెస్ కౌన్సిలర్ అంజాద్ కలుగజేసుకుని ప్రతిసారి బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ వార్డు కాకుండా అన్ని వార్డులపై మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిసారి సమావేశం వాయిదా పడుతుందనడంతో బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగగా కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్చీలు కింద పడేశారు. దాంతో సమావేశం గందరగోళంగా మారింది.
Kamareddy Municipal Meeting | వరదలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు..

కామారెడ్డి (Kamareddy)లో వరదలు వచ్చి ఏడాదైనా ఒక్కరూపాయి ఇవ్వని సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా బీజేపీ ఎమ్మెల్యే ఒక్క పనికి అయినా కొబ్బరికాయ కొట్టి పనులు చేపట్టారా అని కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. కమిషనర్ వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మరోవైపు పట్టణంలో అక్రమ కట్టడాలపై బీఆర్ఎస్ నేతలు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమ కట్టడాలకు నోటీసులిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎజెండాలో ఉన్న అంశాలపై చర్చ మొదలు కాకుండానే వాగ్వాదం, గొడవలు, తోపులాటలు, నిరసనలు కొనసాగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అడిషనల్ కలెక్టర్ ఎన్.వై గిరి కౌన్సిల్ హాలుకు చేరుకుని సమావేశాన్ని కొనసాగించారు.
ఇది కూడా చదవండి..: NEET PG Exam Centres | నీట్ (పీజీ) పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్