అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy development | జిల్లాలో(Kamareddy) తమ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ మూడేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) నివాసంలో శనివారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
Kamareddy development | వరద వచ్చి ఏడాదైనా..
ఏడాదిగా వరద ప్రభావిత ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వని వారికి పిండ ప్రదానం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇలా అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమోనని అలా చేశామని, దానిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. పట్టణంలో డివైడర్లు శాస్త్రీయ పద్ధతిలో నిర్మించలేదని చెప్పడం సిగ్గుచేటని, జాతీయ రహదారిపై డివైడర్లు ఎలా ఉంటాయో అదే విధంగా నిర్మాణం జరిగిందని తెలిపారు. ఏడాది నుంచి డివైడర్ల మధ్య లైట్లు వెలగడం లేదని, ఆ దారి వెంట వెళ్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జీవధాన్ నుంచి చెరువు వద్దకు వెళ్లే రహదారి కేవలం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తవుతుందని, అది కూడా చేయలేదని, దీనికి కూడా శాస్త్రీయ పద్ధతి కావాలా అని ఎద్దేవా చేశారు.
మూడేళ్లలో కోట్లాది రూపాయల పనులు చేశామని చెబుతున్నారని, రూ.5 కోట్ల పనులు కూడా చేయలేదని విమర్శించారు. నాటి సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేసేవారని, ప్రస్తుత సీఎం కామారెడ్డికి వచ్చి రూపాయి ఇవ్వకుండా వెళ్లడం శోచనీయమన్నారు. కేసీఆర్ హయాంలో వచ్చిన రూ.23 కోట్ల టుఫిడ్కో ఫండ్స్ జీవో మార్చి పనులు చేస్తున్నారని, రూ.8 కోట్లతో స్టేడియం పనులకు కేటీఆర్ శిలాఫలకం వేస్తే దానినే కొత్త జీవో తెచ్చి ఇండోర్ స్టేడియం పనులు చేస్తున్నారని విమర్శించారు.
Kamareddy development |3 రూపాయల పనిచేయలేదు
గత ఐదేళ్ల తమ పాలనలో రూ.150 కోట్ల పనులు జరిగాయని, మూడేళ్లలో రూ.3 పనులు కూడా చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.50 కోట్ల పనుల్లో రూ.16 కోట్ల పనులు తిరిగి వెళ్లిపోయాయని, దేవీవిహార్ నుంచి ఎస్పీఆర్ పాఠశాల వరకు రూ.3.5 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనులు చేస్తే మాజీ ఎమ్మెల్యేకు ఎక్కడ పేరు వస్తుందోనని క్యాన్సిల్ చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు నిధులు తెచ్చి, పనులు చేసి తమ విషయంలో మాట్లాడితే బాగుంటుందన్నారు. వరద సమయంలో బాధిత ప్రజల ప్రతి ఇంటికి వెళ్లామని, ఆర్థిక సహాయం అందించామని, ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఎక్కడా కనిపించడం లేదని, వరద సమయంలో బాధిత ప్రజల పట్ల అమానుషంగా మాట్లాడారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసర్ల స్వామి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కుంబాల రవియాదవ్, కౌన్సిలర్లు కౌన్సిలర్లు హఫీజ్, ప్రభాకర్ యాదవ్, లోలం శ్రీనివాస్, మామిండ్ల లక్ష్మణ్, మన్సూర్, భాను పాల్గొన్నారు.