అక్షరటుడే వెబ్‌డెస్క్: Veligonda Project Water Dispute | వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ( Harish Rao )తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ అడ్డగోలుగా నీటి దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా హరీశ్ రావు ఒక పోస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీరును, కేఆర్ఎంబీ (KRMB) వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
Veligonda Project Water Dispute | అక్రమ నీటి తరలింపుపై ఆగ్రహం..
నీటి కేటాయింపులు లేకున్నా, వరద జలాలు రాకున్నా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే, మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Veligonda Project Water Dispute | ఎండిపోతున్న ఆయకట్టు..
కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే, బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తోందని తెలిపారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇదని అన్నారు.
Veligonda Project Water Dispute | కేంద్ర మంత్రికి డిమాండ్..
తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను పొలాలకు మళ్లించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్ఎంబీ (KRMB) సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Kavitha Nizamabad Visit | జిల్లాకు చేరుకున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత