PhonePe UPI 123Pay | ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు

గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని వినియోగదారుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' సోమవారం 'యూపీఐ 123పే' సేవలను అధికారికంగా ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PhonePe UPI 123Pay | గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని వినియోగదారుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ‘ఫోన్‌పే’ సోమవారం ‘యూపీఐ 123పే’ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్లకు పైగా ఉన్న ఫీచర్ ఫోన్ యూజర్లకు ఇంటర్నెట్ లేకుండానే నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని ఈ సర్వీసులు కల్పిస్తాయి. కేవలం సాధారణ 2జీ నెట్‌వర్క్‌లోనూ పనిచేసేలా ఎస్సెమ్మెస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ఫీచర్‌ను లాంచ్ చేసిన తొలి ప్రధాన థర్డ్-పార్టీ యాప్‌గా ఫోన్‌పే గుర్తింపు పొందింది. అంతేకాకుండా, నోకియా ( Nokia ), హెచ్ఎండీ, లావా, ఐటెల్ వంటి ప్రముఖ బ్రాండ్ల కొత్త ఫీచర్ ఫోన్‌లలో ఈ యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుండటం విశేషం.

PhonePe UPI 123Pay | ఏఐ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్..

ఈ సేవల ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీని ఉపయోగించి ఇతరులకు సులభంగా డబ్బులు పంపుకోవచ్చు. కెమెరా అందుబాటులో ఉన్న ఫోన్‌లలో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి నేరుగా వ్యాపారులకు పేమెంట్లు చేయవచ్చు. దీనితో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని పరిశీలించడం వంటి సేవలు కూడా లభిస్తాయి. రాబోయే రోజుల్లో మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపుల ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివేట్ చేసుకోవడానికి ఫోన్‌పే ప్రత్యేకంగా ఒక ‘ఏఐ-ఆధారిత వాయిస్ అసిస్టెంట్’ను పరిచయం చేసింది. ఈ హెల్ప్‌లైన్ ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 12 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తూ యూజర్లకు గైడెన్స్ ఇస్తుంది.

PhonePe UPI 123Pay | అత్యంత సులభం..

ఈ ‘యూపీఐ 123పే’ సేవలను ఉపయోగించడం చాలా సులభం. ఫీచర్ ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేసి, నిబంధనలను అంగీకరించిన తర్వాత తమ బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ చివర ఉండే 6 అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేసి యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. నగదు బదిలీ చేసే సమయంలో ‘పే టూ మొబైల్’ లేదా ‘పే టూ యూపీఐ ఐడీ’ ఆప్షన్‌ను ఎంచుకుని, అవసరమైన వివరాలు, అమౌంట్ ఎంటర్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు, కేవలం సెకన్ల వ్యవధిలోనే లావాదేవీ పూర్తవుతుంది. కెమెరా ఉన్న ఫోన్‌లలో నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు.

ఇది కూడా చదవండి: Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *