Kasganj road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు యాత్రికుల దుర్మరణం.. 20 మందికి గాయాలు..

పోలీసులు, జిల్లా అధికారులు కూడా అక్కడికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా కాస్గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kasganj road accident | ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాకు చెందిన యాత్రికులతో వెళ్తున్న పికప్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. సుమారు 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.

Kasganj road accident | గంగానదిలో అస్థికల నిమజ్జనం..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కరౌలి జిల్లాకు చెందిన యాత్రికులు సోరోన్‌కు వెళ్లేందుకు పికప్ వాహనంలో బయలుదేరారు. అక్కడ గంగానదిలో అస్థికల నిమజ్జనం చేసి పవిత్ర స్నానం చేసేందుకు వారు ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో కోత్వాలీ సదర్ పరిధిలోని మొహన్‌పురా సమీపంలో.. శివ్ ఇంటర్ కాలేజీ ఎదురుగా పికప్ వాహనం, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది.

ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా దెబ్బతినడంతో అందులోని పలువురు ప్రయాణికులు వాహనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు, జిల్లా అధికారులు కూడా అక్కడికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా కాస్గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో మొత్తం దాదాపు 20 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం అలీగఢ్‌కు తరలించారు. మిగతా వారికి కాస్గంజ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతులను ఉమేష్ (26), ప్రేమ్ (50), నెహ్రూ (25), రీనా (32), అంజలి (26), రామ్‌జిత్/రంజిత్ (33)గా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్‌లోని కరౌలి, భరత్‌పూర్ జిల్లాలకు చెందినవారు.

మృతుల్లో ఉమేష్ కరౌలి జిల్లా రేవై గ్రామానికి చెందిన బబ్లూ కుమారుడు. ప్రేమ్, నెహ్రూ సురోత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాథౌలి కా పురా ప్రాంతానికి చెందినవారు. రీనా భరత్‌పూర్ జిల్లాలోని సాలెంపూర్ కలా ప్రాంతానికి చెందినవారు. అంజలి కరౌలి జిల్లాలోని రేవైకు చెందినవారు కాగా, రామ్‌జిత్ / రంజిత్ హిండౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాథౌలి కా పురా ప్రాంతానికి చెందినవారు.

Kasganj road accident | పోలీసుల దర్యాప్తు

ప్రమాదానికి గురైన లారీ షాజహాన్‌పూర్ నుంచి జైపూర్‌కు పశువుల దాణాను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో లారీ రాంగ్​ సైడ్​ నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అదే సమయంలో పికప్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Rupareddy Murder | ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక

రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

Kasganj road accident | కరౌలిలో విషాదం

ఈ ప్రమాదం కరౌలి జిల్లాలోని మృతులు, క్షతగాత్రుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, బంధువులు కాస్గంజ్‌కు బయలుదేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *