Ponnam Prabhakar Challenge | దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి మోడీని నిలదీయండి..బీజేపీకి పొన్నం ప్రభాకర్ సవాల్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ponnam Prabhakar Challenge తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీ నేతలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం మాని నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీయాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే దమ్ము తమకు ఉందని నిరూపించుకోవాలని హితవు పలికారు.

Ponnam Prabhakar Challenge | బాధ్యత బీజేపీ నేతలదే..

తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు , వివిధ అనుమతుల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని పొన్నం ( Ponnam Prabhakar Challenge ) ప్రశ్నించారు. రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక బీజేపీ నేతలపై లేదా అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు, ప్రాజెక్టులు అందుతున్నాయో, అదే విధానం తెలంగాణ విషయంలో ఎందుకు అమలు కావడం లేదో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే అధిష్టానం గుర్తిస్తుందని, ఉనికి నిలబడుతుందని భ్రమపడటం సరికాదన్నారు.

Ponnam Prabhakar Challenge | పెండింగ్ ప్రాజెక్టులపై ఆగ్రహం..

గతంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని పొన్నం నిలదీశారు. ప్రస్తుతం తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ, పాత బకాయిలను కూడా క్రమంగా పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతున్నా తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రం నుంచి భారీగా ఆదాయం కేంద్రానికి వెళ్తున్నప్పటికీ తిరిగి వచ్చే నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్ (RRR) వంటి కీలకమైన ప్రాజెక్టులన్నింటికీ కేంద్రం వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పీఎం మోడీని కలిసి స్పష్టమైన హామీ తీసుకువచ్చే బాధ్యతను బీజేపీ నేతలు నెరవేర్చాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Konda Surekha Dismissal | తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *