అక్షరటుడే, కామారెడ్డి: Lingampet Police | మద్యంమత్తులో ఓ వ్యక్తి టాటా ఏస్ వాహనంలో ముగ్గురు పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరాడు. సమాచారం అందుకుని అప్రమత్తమైన పోలీసులు (Lingampet) అతన్ని అడ్డుకుని నలుగురి ప్రాణాలను కాపాడారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Lingampet Police | కమ్మర్‌పల్లికి చెందిన..
నిజామాబాద్ (Kamareddy) జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన చిత్తరి రాజు ప్రస్తుతం లింగంపేటలో నివాసం ఉంటూ పాత ఇనుప సామాను వ్యాపారం చేసుకుంటున్నాడు. గురువారం అర్ధరాత్రి మద్యం సేవించిన రాజు భార్యతో గొడవపడి ఆవేశంలో తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని చనిపోతానంటూ టాటా ఏస్ వాహనంలో ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ విషయాన్ని గుర్తించిన లింగంపేట బ్లూకోట్స్ సిబ్బంది వెంటనే స్పందించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. పీసీఆర్ ద్వారా సదాశివనగర్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం చేరగానే ఏఎస్సై జగదీష్ వెంటనే అప్రమత్తమై ప్రధాన రహదారులపై గాలింపు చేపట్టారు. వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తించి నిలిపివేసి పరిశీలించగా అందులో రాజు తన ముగ్గురు పిల్లలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లింగంపేట పెట్రోలింగ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని రాజుకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలతో సహా అందరినీ క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Lingampet Police | పోలీసుల సమన్వయంతో..
లింగంపేట బ్లూకోట్స్, పీసీఆర్, సదాశివనగర్ పెట్రోలింగ్ సిబ్బంది సమన్వయంతో సకాలంలో స్పందించడం వల్ల నలుగురి ప్రాణాలకు ముప్పు తప్పింది. సిబ్బంది చూపిన చొరవ, అప్రమత్తత, బాధ్యతాయుతమైన విధినిర్వహణను ఎస్పీ రాజేష్ చంద్ర ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా, మానసిక ఒత్తిళ్లు ఎదురైనా ఆవేశంలో ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందన్నారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని, ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని, ప్రజల రక్షణ, భద్రతకే పోలీసులు తొలి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: “’అక్షరటుడే’ను ఫాలో అవ్వండి..”