Shabbir Ali Kamareddy | మోదీ, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి : షబ్బీర్​ అలీ

ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali Kamareddy | ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేసిన ఘటనతో పాటు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని షబ్బీర్​ అలీ ఖండించారు. ఉత్తరాంఖాండ్​లోని హాల్ద్వానీలోని రాంలీల మైదానంలో మల్లికార్జున్ ఖర్గే నడిచిన ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం అవమానించడమేనన్నారు.

Shabbir Ali Kamareddy | వారిపై చర్యలు తీసుకోవాలి..

తక్షణమే మోడీ, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, గంగాజలంతో ఖర్గే నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఏం చార్జిషీట్ ఓపెన్ చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్​కు కామారెడ్డిలో వరదలు వస్తే పలకరించే బాధ్యత లేదా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇటీవల రూ.105 కోట్లు మంజూరు చేశారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఎక్కడపోయాడని, దమ్ముంటే కామారెడ్డికి వచ్చి ఓడిపోయాక రాలేకపోయినందుకు, వరదల సమయంలో రాలేనందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

ప్రజల్లోకి రాలేని, ప్రజా సమస్యలపై మాట్లాడలేని కేసీఆర్​కు ప్రతిపక్ష హోదా ఎందుకని, రూ.కోట్ల ప్రజల సొమ్ము తీసుకుని ఫామ్ హౌస్​లో పడుకోవడానికా అని విమర్శించారు. కేసీఆర్ రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​కు కామారెడ్డి ప్రజలు 60వేల ఓట్లు వేశారని తెలిపారు. కేసీఆర్ రాకుండా చెంచా గాళ్లు వస్తున్నారని, పోటీ చేసింది కేసీఆరా, ఈ చెంచాగాళ్లా అని ప్రశ్నించారు.

Shabbir Ali Kamareddy | కామారెడ్డిలో బీఆర్​ఎస్​ జూనియర్లు మాట్లాడవద్దు

కేసీఆర్ జెండా పట్టుకుని ఇక్కడ జూనియర్లు మాట్లాడవద్దని షబ్బీర్​అలీ హెచ్చరించారు. కామారెడ్డి కరువుపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాలని, ఫార్మ్ హౌస్​లో కూర్చుని రాజకీయం చేస్తే కుదరదన్నారు. ఎన్నికల్లో నంబర్ 1 పోయాడు.. నంబర్ 2 పోయాడు.. నంబర్ 3 రేవంత్ రెడ్డి నిధులు ఇచ్చారని తెలిపారు. ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని, రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ఒక్క రాష్ట్రంలో అయినా సన్నబియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

మహిళలకు కోటీశ్వరులనే చేయాలనే ఉద్దేశంతో..

మహిళలను కోటీశ్వరులను చేయాలని బస్సులు అప్పగించామని, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామని, కామారెడ్డికి కూడా పెట్రోల్ బంక్ మంజూరైందని తెలిపారు. తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు చేరితే కొత్త భవనం మంజూరు కోసం సీఎంను అడిగితే రూ.5 కోట్లు మంజూరు చేశారన్నారు. రెండుమూడు రోజుల్లో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వసతుల కల్పనపై ప్రిన్సిపాల్ అడిగారని తెలిపారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని, రూ.150 కోట్ల హామీ ఏమైందని ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: “ఇస్రో ఖాతాలో మరో విజయం” 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *