అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress Organisational Reshuffle | వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పలు రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జులను మారుస్తూ శనివారం (సెప్టెంబరు 5, 2026) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకాల వివరాలను వెల్లడించారు.
Congress Organisational Reshuffle | కీలక నాయకుల బాధ్యతలు, మార్పులు..
పంజాబ్‌కు సచిన్ పైలట్: రాజస్థాన్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటివరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్థానంలో పైలట్‌ను నియమించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
అస్సాంలో భూపేష్ బఘేల్: పంజాబ్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఉపశమనం పొందిన భూపేష్ బఘేల్‌కు అస్సాం రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను కట్టబెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు పీవీ మోహన్: కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, గతంలో కేరళ, లక్షద్వీప్ వ్యవహారాలను పర్యవేక్షించిన పీవీ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు.
మహారాష్ట్రకు సిరివెళ్ల ప్రసాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఐసీసీ కార్యదర్శి, గతంలో జార్ఖండ్ వ్యవహారాలు చూసిన డాక్టర్ సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర బాధ్యతలు దక్కాయి.
ఛత్తీస్‌గఢ్‌కు సుఖ్‌దేవ్ భగత్: జార్ఖండ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించారు.
Congress Organisational Reshuffle | రాబోయే ఎన్నికలకు సన్నద్ధం..
ఈ మార్పులతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ.. రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకే ఈ నూతన నాయకత్వాన్ని రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.