అక్షరటుడే వెబ్‌డెస్క్: Singareni Alias Issue | శాసనమండలిలో సింగరేణి కాలరీస్‌లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka )కీలక ప్రకటన చేశారు. ఈ దీర్ఘకాలిక అంశాన్ని మానవీయ కోణంలో పరిశీలించి త్వరలోనే సముచిత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. సింగరేణిలో ఒకరి పేరుతో మరొకరు విధులు నిర్వహించే ఈ మారుపేర్ల వివాదం నిన్న మొన్నటిది కాదని, 1997 నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ సమస్య అని భట్టి గుర్తుచేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించిందని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి అడుగులు వేస్తామని తెలిపారు.
Singareni Alias Issue | చట్టపరమైన చిక్కులు..
ఒకరి పేరు మీద మరొకరు ఉద్యోగం చేయడం చట్టరీత్యా నేరమని, గతంలో ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగా 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు కూడా తీసుకున్నట్లు భట్టి వివరించారు. ప్రస్తుతం సింగరేణిలో 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు కేవలం 128 మందేనని చెప్పారు. సంఖ్య చిన్నదే అయినప్పటికీ లీగల్ ఇబ్బందుల వల్ల అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
Singareni Alias Issue | శాశ్వత పరిష్కారం..
భవిష్యత్తులో తమపై ఏవైనా లీగల్ సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు కార్మికులకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ రెండు అంశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు.ఏ ఒక్క అధికారికీ ఇబ్బంది కలగకుండా, కార్మికుల పరిస్థితులను అర్థం చేసుకుని కమిటీ సిఫార్సుల మేరకు ఆ 128 మంది సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు.
ఇది కూడా చదవండి: Vijay Women Comments | మహిళలను కించపరిస్తే చట్టం ఊరుకోదు.. సీఎం విజయ్ సంచలన హెచ్చరిక