Transformer Copper Theft | జల్సాల కోసం చోరీలు.. అన్నదమ్ముల ముఠా గుట్టురట్టు

జల్సాలకు, ఆన్​లైన్ బెట్టింగ్​కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి:  Transformer Copper Theft | జల్సాలకు, ఆన్​లైన్ బెట్టింగ్​కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అన్నదమ్ములు నలుగురు ముఠాగా ఏర్పడి పాల్పడుతున్న చోరీలకు కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రాన్స్​ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

 Transformer Copper Theft | 29 ట్రాన్స్​ఫార్మర్లు..

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఐదు నెలలుగా భిక్కనూర్ మండల పరిధిలోని బస్వాపూర్, భిక్కనూర్​, గుర్జకుంట, రమేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి గ్రామాల శివారులతో పాటు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల శివార్లలో 29 ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీకి గురైనట్లు అసిస్టెంట్ ఇంజినీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 9న రామేశ్వరపల్లి శివారులో చోరీ చేస్తుండగా అడ్డుకున్న లైన్​మన్​ ప్రభాకర్​పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కూడా కేసు నమోదైంది. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూర్ సీఐ జగడం నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు అనిల్, మహేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి భిక్కనూరు మండలంలోని పరివార్ హోటల్ వద్ద మరొక చోరీ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నలుగురు నిందితులు సొంత అన్నదమ్ములని, మేడ్చల్-హైదరాబాద్​కు చెందిన బల్జీర్ సింగ్ చతుర్ సింగ్ టాక్, రూప్ సింగ్ చతుర్ సింగ్ టాక్, లకన్ చతుర్ సింగ్ టాక్​గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

 Transformer Copper Theft | గతంలోనూ వీరిపై కేసులు..

వీరు గతంలోనూ దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కామారెడ్డిలో 29, మెదక్ జిల్లాలో 23 చొప్పున మొత్తం 52 ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలు, ఒక హత్యాయత్నం, ఒక ఇంటి దొంగతనం చేసినట్లు తేలింది. దొంగిలించిన కాపర్​ను హైదరాబాద్​లో ఓ మధ్యవర్తి ద్వారా ముగ్గురు వ్యక్తులకు కిలో రూ. వెయ్యి చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యవర్తి, కొనుగోలుదారుల కోసం ప్రత్యేక బృందం గాలింపు చేపడుతోంది. నిందితుల నుండి 30 కిలోల కాపర్ వైర్, బైక్, మొబైల్ ఫోన్​తో పాటు చోరీకి ఉపయోగించిన కట్టర్లు, పానాలు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, భిక్కనూర్ సీఐ జగడం నరేష్, ఎస్సై అనిల్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: EHS Health Card | అత్యవసర చికిత్సకు అక్కరకు రాని హెల్త్​కార్డు​.. పాప చికిత్స కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *