అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Union Elections | ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు దశాబ్దం తర్వాత జరుగుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల హక్కులను ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు శుక్రవారం కార్మిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని చెప్పారు.
RTC Union Elections | ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమంలో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయని పొన్నం గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన కార్మిక సంఘాల హక్కులను గత ప్రభుత్వం అణచివేసిందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
RTC Union Elections | ప్రభుత్వంలో విలీనంపై..
ఎన్నికల అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్యలు ప్రారంభిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులను కమిటీలో భాగస్వాములను చేసి.. ఆర్టీసీ విలీనంపై ముందుకు వెళ్తామని చెప్పారు.
దీనిని కూడా చదవండి : Urea Bags Missing | సొసైటీలో యూరియా బస్తాలు మాయం.. అధికారులను నిలదీసిన రైతులు