అక్షరటుడే వెబ్‌డెస్క్: Jurala Water Release | ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో రైతులు ఆందోళనకు దిగడం, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో రాజకీయంగానూ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. పాలమూరు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను వివరించి, జూరాలకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Jurala Water Release | నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి..
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి కలిశారు. కర్ణాటకతో చర్చించాల్సిన అంశాలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం వారు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి, జూరాలకు నీటిని కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపడంతో పాటు, ఆ నీటిని దశలవారీగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఇది కూడా చదవండి: GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో