అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RI Caught by ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు (ACB Raids) చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ప్రజల్లో సైతం అవినీతిపై అవగాహన పెరగడంతో అధికారులు లంచాలు అడిగితే ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.
నల్గొండ (Nalgonda) జిల్లా నాంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు చేశారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రల్లబండి గోప రాజును అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని ఓ వ్యక్తి వ్యవసాయ భూమికి సంబంధించి పంచనామా నివేదికను తహశీల్దార్‌కు సమర్పించడం కోసం ఆర్ఐ రూ.15 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
RI Caught by ACB | ప్రైవేట్ ఏజెంట్ ద్వారా…
ఆర్ఐ గోపరాజు భారీగా లంచాలు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వసూలు చేయడానికి ఆయన ఏకంగా ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా అడుల్ల యాదగిరి అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఫిర్యాదిదారుడి నుంచి రూ.15 వేల లంచం స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ యూనిట్ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. ఆర్ఐతో పాటు ప్రైవేట్ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలువురు అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని ఆపరేటర్లు, తమ డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల