అక్షరటుడే, వెబ్‌డెస్క్: IIT Placement Ban | కష్టపడి జేఈఈ సాధించి, ఐఐటీల్లో అడుగుపెట్టి, క్యాంపస్ ఇంటర్వ్యూలలో దిగ్గజ కంపెనీల ఉద్యోగాలకు ఎంపికైతే ‘లైఫ్ సెటిల్’ అనుకునే పరిస్థితికి కాలం చెల్లిపోతోందా?
అగ్రగామి విద్యా సంస్థలైన ఐఐటీలలో నమ్మశక్యం కాని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాబ్ ఆఫర్ లెటర్లు చేతికి ఇచ్చి, ఆ తర్వాత విధుల్లోకి తీసుకోకుండా తిరస్కరించిన 22 బహుళజాతి కంపెనీలపై ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ (AIPC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
గువాహటిలో సమావేశమైన ఏఐపీసీ (AIPC).. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 22 కంపెనీలను రాబోయే రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్ల నుంచి నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
IIT Placement Ban | ఆఫర్ లెటర్లు ఇచ్చి హ్యాండిచ్చిన కంపెనీలు!
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కృత్రిమ మేధస్సు (AI) వాడకం, ఆర్థిక మాంద్యం భయాల సాకుతో ఒరాకిల్ (Oracle) వంటి ప్రముఖ సంస్థలతో పాటు మొత్తం 22 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఎంపిక చేసిన సుమారు 150 మందికి పైగా విద్యార్థుల ఆఫర్ లెటర్లను కాలయాపన చేస్తూ తిరస్కరించాయి.
ఐఐటీ నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి క్యాంపస్ డ్రైవ్‌లో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. మిగతా విద్యార్థులకు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో మరొక కంపెనీ ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉండదు.
ఆఫర్ లేటర్ వచ్చిందనే ఆనందంతో వేరే ఉద్యోగ యత్నాలు విడిచిపెట్టిన విద్యార్థులు, చివరి నిమిషంలో కంపెనీలు హ్యాండివ్వడంతో తీవ్ర మానసిక ఆందోళనకు, ప్రెజర్‌కు గురయ్యారు.
IIT Placement Ban | పరిహారం చెల్లించాలని డెడ్‌లైన్!
అకస్మాత్తుగా ఆఫర్ లెటర్లను రద్దు చేసిన కంపెనీలు విద్యార్థులకు 3 నెలల వేతనాన్ని పరిహారంగా చెల్లించాలని ఏఐపీసీ గడువు విధించినప్పటికీ, ఆ సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఐఐటీల కమిటీ ఈ కఠిన నిర్ణయం వైపు అడుగులు వేసింది. గతంలో 2016 లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఏఐపీసీ ఇదే తరహాలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
IIT Placement Ban | విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఉద్యోగాలు కోల్పోయిన ఆ 150 మంది బాధిత విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు ఏఐపీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇతర విద్యార్థులు విదేశీ విద్య, వేరే కారణాలతో ఖాళీ చేసిన పోస్టులలో వీరికి అవకాశం ఇచ్చేలా వివిధ కంపెనీల రిక్రూటర్లతో సంప్రదింపులు జరుపుతోంది.
IIT Placement Ban | తల్లిదండ్రులు, విద్యార్థులు మారాల్సిన సమయం!
ఐఐటీ సీటు సాధిస్తే ఉద్యోగం ఖాయమనే పాత ఆలోచనల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు బయటపడాలని విద్యావేత్తలు, విశ్లేషకులు సూచిస్తున్నారు. కార్పొరేట్ జగత్తులో మారిన పరిస్థితుల దృష్ట్యా కేవలం డిగ్రీ, బట్టీ చదువుల మార్కులు సరిపోవు.
ఏఐ (AI) పరిజ్ఞానం, నిరంతర నైపుణ్యాలు (Skills) పెంచుకోవడం అత్యవసరం. కేవలం ఉద్యోగం కోసం ఎదురుచూసే ఎంప్లాయ్‌గా మాత్రమే గాక, ఐఐటీల్లో ఉండే వసతులతో సరికొత్త ‘స్టార్టప్‌లు’ నెలకొల్పి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది.