అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Secretariat Tension | తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, పాలనా యంత్రాంగం నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతోందనే దానికి నిదర్శనంగా మంగళవారం రాష్ట్ర సచివాలయం వేదికగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ప్రభుత్వ వైఫల్యాలు, నిధుల కొరతతో విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఏకంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ఎదుటే ఆందోళనకు దిగారు.
Telangana Secretariat Tension | రూపాయి విడుదల కాక తీవ్ర ఇబ్బందులు
ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బిల్లులు, ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాల డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని బాధితులు మండిపడ్డారు. చివరికి కుటుంబ సభ్యులు చనిపోయినా.. ప్రభుత్వం నుంచి రావలసిన సొమ్ము అందుబాటులోకి రాక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
“జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్ అయ్యాక కూడా మా హక్కుల కోసం సచివాలయం చుట్టూ తిరగాల్సి రావడం దారుణం. 2024 ఆగస్టులో ఉద్యోగి చనిపోయినా నేటికీ కుటుంబానికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా?” అని ఓ బాధితురాలు ఆవేదనతో ప్రశ్నించారు.
Telangana Secretariat Tension | మంత్రి దర్శనమూ లభించని పరిస్థితి!
సమస్యలను విన్నవించుకుందామని సచివాలయానికి వస్తే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కానీ, ఫైనాన్స్ సెక్రెటరీ కానీ తమను కలవడానికి కూడా ఇష్టపడటం లేదని బాధితులు ఆరోపించారు. ఎంతసేపు తిరిగినా అధికారులు, మంత్రులు దొరక్కపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.
Khairatabad Assembly Seat | ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల
Telangana Secretariat Tension | పోలీసుల మోహరింపు
సమస్యను పరిష్కరించాల్సింది పోయి, న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను, కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రదర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య సచివాలయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Telangana Secretariat Tension | కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ..
ప్రభుత్వ నిర్వహణలో ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ప్రకటనలకే ప్రాధాన్యమిస్తూ, ఏళ్ల తరబడి కష్టపడిన విశ్రాంత ఉద్యోగుల పొదుపు మొత్తాలను, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను నిలిపివేయడం ప్రభుత్వ ఆర్థిక దివాలా కోణాన్ని బయటపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పిల్లల పెళ్లిళ్లు, అనారోగ్య సమయాల్లో వైద్య ఖర్చులు, ఇల్లు కట్టుకునే అవసరాలకు కూడా తమ సొంత డబ్బులను పొందే మార్గం లేక ప్రజలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలను విడుదల చేయకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.