అక్షరటుడే, వెబ్‌డెస్క్: NIMS Doctor DA Case | నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital) సీనియర్ అధికారి డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాల్లో సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం పలువురి నివాసాల్లో తనిఖీలు చేశారు.
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అక్రమాస్తుల (DA) కేసు దర్యాప్తులో భాగంగా, NIMS ఉద్యోగులకు చెందిన ఐదు ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆస్పత్రిలో బార్బర్‌గా పనిచేస్తున్న ధన్‌రాజ్ వద్ద రూ. 7 లక్షల నగదు లభ్యమైంది. అంతేగాకుండా ఉద్యోగుల నివాసాల్లో భూమికి సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాలు జరుపుతున్న ఐదుగురు నిమ్స్ ఉద్యోగుల నివాసాలలో ధనరాజ్‌తో పాటు మరో బార్బర్ కూడా ఉన్నాడు.
NIMS Doctor DA Case | డాక్టర్‌తో సంబంధంపై ఆరా..
ధనరాజ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రూ.7 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అతడికి డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్ ఇంకా ఎవరితో సన్నిహితంగా ఉన్నారనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిమ్స్ అధికారికి నేరుగా సంబంధం ఉన్న ఆస్తులకే పరిమితం కాకుండా, అతని చుట్టూ పనిచేసే వ్యక్తుల లావాదేవీలను కూడా పరిశీలిస్తుండటం గమనార్హం. ఏసీబీ ఇటీవల భాస్కర్ నివాసంతో పాటు, బంధువులు, సహచరులు మరియు అనుమానిత బినామీలకు సంబంధించిన ఇళ్లలో సోదాలు చేపట్టింది. సుమారు రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ భారీగా ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఉద్యోగుల ఇళ్లలో సైతం నగదు, పత్రాలు లభ్యం కావడం నిమ్స్‌లో అవినీతికి అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి..: Telangana Weather | మండుతున్న ఎండలు.. రైతులకు అలర్ట్