అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | కాంగ్రెస్ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Harish Rao Comments | ఆగిపోయే దుస్థితి..
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అట్టర్‌ఫ్లాప్ అయ్యారని హరీశ్‌రావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేట్‌లో కలపడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎగ్గొట్టడం వంటి చర్యలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులు అర్ధాంతంగా ఆగిపోయే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు కేటాయించి విద్యార్థులను ఆదుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నీరుగారుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సుమారు 300 ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయని ఆరోపించారు.
Harish Rao Comments | జీవో 97ను రద్దు చేయాలి..
పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించడంపై తీవ్రంగా స్పందించిన ఆయన, దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం మోసం చేసిందని, తొలి సంవత్సరంలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల ‘జాబ్ క్యాలెండర్’ కాస్తా ‘జాబ్‌లెస్ క్యాలెండర్’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలకే పరిమితమైందని విమర్శించారు.
Harish Rao Comments | జెన్‌జీ శక్తితో గద్దె దించుతాం..
యువతను, జెన్‌జీ (Gen-Z) ని తక్కువ అంచనా వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హరీశ్‌రావు హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని, దమ్ముంటే ఫీజులు ఇవ్వకుండా మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. విద్యార్థుల పక్షాన అసెంబ్లీ వేదికగా గట్టిగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ధర్నా