Kamareddy Theft Cases | కామారెడ్డిలో వరుస దోపిడీలు.. పోలీసులకు సవాల్​ విసురుతున్న దొంగలు

దొంగలు రూట్ మార్చారా..? వస్తువులు, నగదుపై ఆసక్తి చూపడం లేదా..? బంగారు నగలపై కన్నేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Cases | కామారెడ్డిలో దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారు ఆభరణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకు పసిడి అందని ద్రాక్షగా మారింది. దీన్నే అదునుగా చేసుకున్న దొంగలు నగదు కంటే బంగారం నగలపైనే కన్నేశారు. ఎక్కడ బంగారం కనిపిస్తే అక్కడ దాడులకు సైతం తెగబడుతున్నారు.

Kamareddy Theft Cases | కామారెడ్డి నడిబొడ్డున

ఒకప్పుడు ఇళ్లలో నగదు, టీవీలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసే దొంగలు ఇప్పుడు రూట్ మార్చారు. బుధవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో జరిగిన రెండు ఘటనలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాత్రి సమయంలో, అందులోనూ జిల్లా కేంద్రం నడిబొడ్డునే ఇలాంటి దారుణాలు జరగడం పోలీసు వ్యవస్థను సవాల్ చేసినట్లయింది.

Kamareddy Theft Cases | గంటల వ్యవధిలో హత్య.. దాడి

బుధవారం ఒక్కరోజే గంటల వ్యవధిలో రెండు ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. పాత బస్టాండ్ సమీపంలోని కోటారి గల్లీలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లి హత్య చేసి పారిపోయారు. అదే రోజు అర్ధరాత్రి కల్కినగర్ కాలనీలో ఇంట్లో హాల్లో పడుకున్న మహిళ మెడలో 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో కళ్లలో కారంచల్లి గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Kamareddy Theft Cases | గల్లీల్లో కరువవుతున్న పోలీస్ పెట్రోలింగ్

జిల్లా కేంద్రంలో నేరాలు పెరుగుతున్నా గల్లీల్లో పోలీస్ పెట్రోలింగ్ కరువైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో తప్ప కాలనీల్లో, గల్లీల్లో రాత్రి వేళల్లో పోలీసుల జాడే కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో రాత్రిపూట నిరంతరం తిరిగే పెట్రోలింగ్ వాహనాలు ఇప్పుడు కనిపించడం లేదని, దీంతో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100, 112 నంబర్లకు ఫోన్ చేస్తే తప్ప పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి.

Kamareddy Theft Cases | ఆకతాయిల అడ్డాగా

పట్టణంలోని కోటారి గల్లీ ఆకతాయిలకు అడ్డాగా మారిందన్న ప్రచారం సాగుతోంది. ఈ గల్లీలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారం జోరుగా సాగుతోందని, అలాగే వ్యభిచారం కూడా జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. నిత్యం ఈ దారి నుంచి మార్కెట్ వైపు వందలాది మంది వెళ్తుంటారు. మద్యం సేవించి వచ్చిపోయే వారిని ఆకతాయిలు అటకాయిస్తారన్న ప్రచారం ఉంది. ఈ గల్లీలో నిఘా సీసీ కెమెరాలు లేవని, పోలీసుల పెట్రోలింగ్ కూడా ఉండదన్న ప్రచారం ఉంది. దాంతో ఆ దారిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది.

Kamareddy Theft Cases | వరుస ఘటనలతో బెంబేలు

కామారెడ్డి పరిధిలో ఇటీవల దొంగలు హల్​చల్​ చేస్తున్నారు. పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారు. జయశంకర్ కాలనీలో ఓ ఇంట్లో నుంచి ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. అలాగే విద్యానగర్ కాలనీలో ఇంట్లో భోజనం చేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. లింగాపూర్ శివారులో అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న మహిళ ఇంట్లో తలుపులు, గొళ్లెం పెట్టి ఉన్నా బంగారం మాయం కావడం కలకలం రేపింది. ఒకేరోజు గంటల వ్యవధిలో ఓ హత్య, ఓ మహిళపై దాడి ఘటనలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గల్లీలలో గస్తీ పెంచడంతో పాటు సీసీ కెమెరాలను పటిష్టం చేయాలని, ప్రతి రోజు తప్పనిసరిగా పోలీసులు పెట్రోలింగ్ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Collector Ila Tripathi | బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *