Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Advisors | తెలంగాణ (Telangana)లో సలహాదారుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రభుత్వం పలువురు నేతలు, రిటైర్డ్ అధికారులకు అడ్వైజర్​ పోస్టులను కట్టబెడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో సలహాదారుల నియామకంతో ఖాజానాపై తీవ్ర భారం పడుతోంది. మంత్రి, ఇతర పదువులు ఆశించి భంగపడ్డ వారిని కేబినెట్​ హోదాతో ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తుండటం గమనార్హం. అయితే వీరు ఎం సలహాలు ఇస్తారు.. వాటిని ఎవరు స్వీకరిస్తారని విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govrnment) మరో ఇద్దరు కీలక వ్యక్తులకు సలహాదారుల పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో (వీహెచ్) పాటు, తాజాగా డీజీపీగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి బత్తుల శివధర్ రెడ్డి (Sivadhar Reddy)కి నూతన బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వ బాటలోనే రిటైర్డ్ అధికారులకు, రాజకీయ నేతలకు వరసపెట్టి ‘సలహాదారు’ పదవులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Advisors | వీహెచ్‌కు పదవి

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను బీసీ సంక్షేమ సలహాదారుగా నియమించిన ప్రభుత్వం, ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించింది. అలాగే ఈరోజే డీజీపీగా రిటైర్ అయిన శివధర్ రెడ్డిని మూడు ఏళ్ల పాటు భద్రతా సలహాదారుగా నియమించడం చర్చనీయాంశమైంది. 32 ఏళ్ల సర్వీసు ముగిసిన వెంటనే ఆయనకు మళ్ళీ ప్రభుత్వ కారు, బంగ్లా, భారీ సిబ్బందిని కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై “రిటైర్డ్ అధికారులకు ఇది పునరావాస కేంద్రంగా మారిందా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Telangana Advisors | ఇష్టానుసారంగా పదవులు

బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 మందికి పైగా సలహాదారులు ఉండేవారు. అప్పట్లో ప్రతిపక్షాలు దీనిని “నిరుద్యోగ అధికారుల పునరావాస కేంద్రం”గా అభివర్ణించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారులను నియమించినప్పుడు “ఖజానా దోపిడీ” అని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది.

Telangana Advisors | ఎంత మంది ఉన్నారంటే..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 10 మందికి పైగా సలహాదారులను నియమించింది. వీరిలో వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), షబ్బీర్ అలీ (సంక్షేమం), హర్కర వేణుగోపాల్ (ప్రోటోకాల్), మల్లు రవి (ఢిల్లీ ప్రతినిధి), ఆదిత్య నాథ్ దాస్ (నీటి వనరులు), పోచారం శ్రీనివాస్​ రెడ్డి (వ్యవసాయం), సుదర్శన్​రెడ్డి (సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు) ఉన్నారు. ఇప్పుడు వీహెచ్, శివధర్ రెడ్డి ఈ జాబితాలో చేరారు.

Telangana Advisors | రిటైర్డ్​ అధికారులకు..

సర్వీసులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదిత్య నాథ్ దాస్ (మాజీ ఐఏఎస్), ఇప్పుడు శివధర్ రెడ్డి (మాజీ ఐపీఎస్) వంటి అధికారులకు పదవులు దక్కాయి.

Telangana Advisors | బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి..

సలహాదారుల నియామకంలో బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరిన కె. కేశవరావు, పోచారం శ్రీనివాస్​రెడ్డి వంటి వారికి కూడా సలహాదారు పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రభుత్వం ఇష్టానుసారంగా సలహాదారుల పోస్టులను పెంచుకుంటూ పోవడం ఖజానాపై భారమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Governor Felicitation Event | తెలంగాణ గవర్నర్​ను సన్మానించిన ఎంపీ అర్వింద్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *