అక్షరటుడే వెబ్‌డెస్క్: Alipiri Leopard Movement | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి కదలికలు మరోసారి తీవ్ర కలకలం రేపాయి. అలిపిరి మార్గంలోని ‘మోకాలి మిట్ట’ సమీపంలో వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. అయితే, ఆ సమయంలో నడకదారిలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం త తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Alipiri Leopard Movement | అటవీ శాఖ అప్రమత్తం..
నడక మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించిన వెంటనే తిరుమల తిరుపతి ( Tirupati ) దేవస్థానం (టీటీడీ) అధికారులు, అటవీ శాఖ సిబ్బంది తక్షణమే స్పందించి అప్రమత్తమయ్యారు. ఇటీవల కాలంలో అలిపిరి దారిలో తరచూ చిరుతలు దర్శనమిస్తుండటంతో, భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ భద్రతా సిబ్బంది , అటవీ అధికారులు ఆయా ప్రాంతాల్లో పహారాను మరింత తీవ్రతరం చేశారు. భక్తులంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Alipiri Leopard Movement | కీలక మార్గదర్శకాలు..
నడక మార్గంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకుండా, సమూహాలుగా (గుంపులుగా) మాత్రమే ముందుకు సాగాలి. చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఏమాత్రం చేయి వదలకుండా జాగ్రత్త వహించాలి. నడకదారి పొడవునా భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారు. మార్గమధ్యంలో క్రూరజంతువులు లేదా ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇది కూడా చదవండి: Bishnoi Gang Encounter | బిష్ణోయ్ గ్యాంగ్‌పై పోలీసుల కాల్పులు