అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dasara Special Buses | దసరా సమీపిస్తోంది. ఈ నెల 10 నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివాసం ఉండే వారు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ (TGSRTC) కీలక ప్రకటన చేసింది. 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొంది.
పండుగ రద్దీ వేళ ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. అయితే 50శాతం అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. కరీంనగర్ జోన్ నుంచి 3,533, హైదరాబాద్ జోన్ నుండి 2,155, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుండి మరో 1,312 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలలో ప్రయాణికుల రద్దీ గరిష్టంగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది.
Dasara Special Buses | తిరుగు ప్రయాణంలో..
దసరా అనంతరం అక్టోబర్ 25, 26 తేదీలలో తిరుగు ప్రయాణ రద్దీ సమయంలో సైతం అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. హైదరాబాద్‌లో MGBS, JBS, ఉప్పల్ (నల్లచెరువు), ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్‌రోడ్స్, KPHB, బోయిన్పల్లి మరియు గచ్చిబౌలి వంటి ప్రధాన ప్రయాణ కేంద్రాల నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. అక్టోబర్ 9, 10, 16, 17, 25, 26 తేదీలలో నడిపే ప్రత్యేక బస్సుల ఛార్జీలను సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు వరకు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అయితే, సాధారణ బస్సు సర్వీసులకు మాత్రం సాధారణ ఛార్జీలే కొనసాగుతాయి. దసరా సమయంలో కూడా ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుంది.
దీనిని కూడా చదవండి : HMWSSB | నీరు వృథా చేసినందుకు రూ.20 వేల ఫైన్