Kamareddy Education Hub | అటకెక్కిన ఎడ్యుకేషన్ హబ్.. కామారెడ్డిలో అందని ద్రాక్షగా ఉన్నత చదువులు

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కామారెడ్డి విద్యార్థుల పరిస్థితి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Education Hub | అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కామారెడ్డి (Kamareddy) విద్యార్థుల పరిస్థితి. జిల్లా కేంద్రంగా మారి పదేళ్లయినా.. అనుకున్న స్థాయిలో విద్యాసంస్థల ఏర్పాటు కాలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని పాలకులు ఎన్నికల్లో చెప్తున్న మాట హామీగానే మిగిలిపోతుందన్న ఆరోపణలు ఉన్నాయి.

కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. పాలకులు ఎన్నికల సమయంలో పట్టణానికి వచ్చి కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పదేళ్ల కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థల ఏర్పాటును విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు గుర్తు చేస్తున్నారు.

Kamareddy Education Hub |  కొత్తవాటికి మోక్షమెప్పుడో..!

జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నాయకులు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్​గా మారుస్తామని చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమే కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నది ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రమే. అందులో కూడా ఎంబీఏ, ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇంజినీరింగ్, ఎల్​ఎల్​బీ, లా, నర్సింగ్, ఐటీఐ లాంటి వృత్తి విద్యా కళాశాలలు ఇప్పటివరకు రాలేదు. దోమకొండ, గాంధారి, పిట్లం లాంటి పెద్ద మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం నిజామాబాద్, హైదరాబాద్ వైపు చూడాల్సి వస్తోంది.

Kamareddy Education Hub | పాలిటెక్నీక్.. ఉమెన్స్ కళాశాల కలేనా..?

జిల్లాకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరవుతుందని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కామారెడ్డికి మొండిచేయి చూపుతూనే ఉన్నాయి. జిల్లాకు మంజూరైన పాలిటెక్నిక్​ను నస్రుల్లాబాద్​కు తరలించడంతో కామారెడ్డి విద్యార్థులు నిరాశకు గురయ్యారు. అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల సైతం మంజూరుకు నోచుకోవడం లేదు, ప్రకటనకే పరిమితమై కనుమరుగైంది. సొంత భవనం లేక బాలికల విద్య మరింత వెనుకబడుతోంది. ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలు నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

Kamareddy Education Hub | జిల్లా కేంద్రాన్ని దాటుతున్న విద్యాసంస్థలు

మంజూరైన సంస్థలు కామారెడ్డి దాటి వెళ్తున్నాయనే ఆవేదన విద్యార్థి లోకంలో వ్యక్తమవుతోంది. కామారెడ్డికి రావాల్సిన తెలంగాణ యూనివర్సిటీ పాలకుల నిర్లక్ష్యంతో డిచ్​పల్లికి వెళ్లిందని విద్యార్థి సంఘాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం భిక్కనూర్​లోని సౌత్ క్యాంపస్​ను మెయిన్ క్యాంపస్​గా మార్చి, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను దాని సౌత్ క్యాంపస్​గా మార్చాలన్న డిమాండ్ విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. కొత్త విద్యాసంస్థలు వస్తే జిల్లా కేంద్రంలోనే విద్యార్థులకు ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలు మెరుగవుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు.

Kamareddy Education Hub | పట్టించుకోని అధికారులు..

పదేళ్ల కామారెడ్డి జిల్లా అభివృద్ధిలో విద్యారంగం అట్టడుగున ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి కామారెడ్డిలో భూమికి కొరత లేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట 148 ఎకరాల ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన స్థలం పోగా ఇంకా 50 నుంచి 60 ఎకరాలు ఖాళీగా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అందుబాటులో భూములున్నా, డిమాండ్ ఉన్నా కొత్త కళాశాలల కోసం ప్రతిపాదనలు పంపడంలో అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కామారెడ్డి పట్టణంలో ఇంజనీరింగ్, ఎల్​ఎల్​బీ, నర్సింగ్, మహిళా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Kamareddy Education Hub | విద్యాభివృద్ధి హామీలను అమలు చేయాలి

– వినయ్, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు
కామారెడ్డి ప్రజలకు సీఎం ఇచ్చిన విద్యా అభివృద్ధి హామీలను అమలు చేయాలి. కామారెడ్డి, కొడంగల్ రెండు కళ్లులాంటివని సీఎం స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేసి, కొత్త డిగ్రీ, పీజీ, కోర్సులు,టెక్నికల్, ప్రొఫెషనల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. విద్యార్థి సేన తరఫున కామారెడ్డికి ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

Kamareddy Education Hub | కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్​గా మార్చాలి

– జీవీఎం విఠల్, ఏఐఎస్ఏ జిల్లా కన్వీనర్

కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్​గా అభివృద్ధి చేయాలి. గత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ విద్యాసంస్థలు ఏర్పాటు కాలేదు. విద్యాసంస్థలు లేక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సౌత్ క్యాంపస్​ను పూర్తిస్థాయి యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలి. డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు, ఇంజనీరింగ్, లా, పాలిటెక్నిక్, నర్సింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. బీసీ, ఎస్సీ, మహిళా వసతి గృహాలు నిర్మించాలి.

ఇది కూడా చదవండి..: Prajavani Complaints | కలెక్టరేట్​లో ప్రజావాణికి 89 ఫిర్యాదులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *