అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Case | ఇంట్లో పనిమనిషిగా ఉంటానని వచ్చిన ఓ మహిళ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనలో పనిమనిషి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ రాజేష్‌చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
Kamareddy Murder Case | కామారెడ్డి పట్టణంలో..
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 29 న కోటారి గల్లీలో అనసూయ అనే వృద్ధురాలు భర్త బయట నుంచి వచ్చేసరికి అనుమానాస్పద స్థితిలో స్పృహ కోల్పోయి ఉంది. ఆమె మెడపై గాయంతో పాటు బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించగా ఇంట్లో పనిచేసే పనిమనిషితో పాటు మరికొందరిని విచారించారు. చివరికి పనిమనిషి రజితపై అనుమానం రావడంతో ఆమె కదలికలపై నిఘా వేసిన పోలీసులకు భర్తతో కలిసి రజితనే ఈ హత్యకు కారణమని తేల్చారు. ప్రతిరోజు సాయంత్రం వృద్ధురాలి భర్త గుడికి వెళ్లడం అలవాటు కాగా29న సైతం సాయంత్రం ఆయన గుడికి వెళ్లాడు. అదే సమయంలో భర్త నర్సింగ్‌తో కలిసి వృద్ధురాలిని వెనకనుంచి టవల్‌ను మెడకు బిగించి హత్యచేసి ఆభరణాలు దోచుకున్నారు. వృద్ధురాలు గుర్తు పడుతుందని హత్య చేసి బంగారంతో ఉడాయించి తమపై అనుమానం రాకుండా ఎప్పటిలాగే పనికి వచ్చారు.
Kamareddy Murder Case | పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో..
పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశతో బంగారాన్ని దొంగిలించాలని పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2023లో కూడా ఇదే జంట కామారెడ్డిలో ఓ ఇంట్లో పని చేస్తుండగా ఇదే తరహాలో చోరీకి పాల్పడగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వీరిని అరెస్ట్ చేయలేదని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ కేసు కూడా రీ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పుస్తెల తాడు, రెండు బంగారు ఉంగరాలు, చెవి కమ్మలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇంట్లో పని మనుషులను నియమించుకునే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. పని మనుషులపై అనుమానాలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి, ఎస్సై సాయికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nandigutta Illegal Mining | నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి..