అక్షరటుడే వెబ్‌డెస్క్: Nanabiyyam Bathukamma |తీరొక్క పూల అలంకరణలు, చప్పట్ల తాళాలు, జానపద గేయాల హోరు మధ్య తెలంగాణ ( Telangana ) ఆడపడుచులు జరుపుకునే విశిష్ట పండుగ ‘బతుకమ్మ’. ఇది కేవలం పూల వేడుక మాత్రమే కాదు. ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం, మహిళల ఐక్యతకు నిదర్శనం , తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక వారసత్వం.
తంగేడు, గునుగు, బంతి వంటి రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, గౌరమ్మను పూజిస్తూ ఆడిపాడే ఈ పండుగలో పల్లెటూరి ఆత్మీయతలు ప్రతిఫలిస్తాయి. కాల మార్పులతో సంబంధం లేకుండా నేడు ఈ పండుగ వైభవం సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతోంది.
Nanabiyyam Bathukamma | మొదటగా ‘బొడ్డెమ్మ’ వేడుక..
ఎంగిలిపూల అమావాస్యకు ముందు భాద్రపద బహుళ దశమి నుంచే ‘బొడ్డెమ్మ’ వేడుకలు మొదలవుతాయి. ‘ బాలికల నుండి యువతులుగా ఎదిగే క్రమానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. రాత్రి వేళల్లో చిన్న పిల్లలు, యువతులు బృందాలుగా చేరి మట్టి, పువ్వులతో చేసిన బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’, మూడో రోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’ పూజలు ముగిశాయి.
Nanabiyyam Bathukamma | ‘నానబియ్యం బతుకమ్మ’
పండుగలో నాలుగో రోజును ‘నానబియ్యం బతుకమ్మ’గా కొలుస్తారు. ఈ రోజున బియ్యాన్ని నానబెట్టి, ఆరబెట్టిన తర్వాత మెత్తగా పిండి చేస్తారు. ఆ పిండిలో పాలు, చక్కెర, నెయ్యి కలిపి చిన్న ఉండలుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్త పంట వచ్చే శరదృతువు కాలంలో బియ్యంతో చేసిన ఈ ప్రత్యేక పిండి పదార్థాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.
Nanabiyyam Bathukamma | పాటల రూపంలో జానపద కథలు..
బతుకమ్మ వేడుకల్లో పాటలదే ముఖ్య పాత్ర. వందల ఏండ్లుగా ఈ జానపద గేయాలు మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందుతూ వస్తున్నాయి. ధర్మాంగుని కథతో పాటు అన్నాచెల్లెళ్ల అనుబంధం, తల్లీపిల్లల బంధం, పౌరాణిక , సామాజిక విషయాలు ఈ పాటల్లో దాగి ఉంటాయి. వయసు, హోదాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆడే ఈ పండుగ మానవ సంబంధాలను మరింత బలపరుస్తుంది.
ఇది కూడా చదవండి: Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు