అక్షరటుడే వెబ్‌డెస్క్: JNU Sexual Harassment Case | ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeswari ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదని, విచారణలో రుజువైన పచ్చి నిజమని ఆమె స్పష్టం చేశారు. జేఎన్‌యూ యాజమాన్యం నియమించిన అంతర్గత విచారణ కమిటీ నివేదికలోనే నిందితుడు ఏకంగా 11 మంది విద్యార్థినులను వేధించినట్లు స్పష్టంగా తేలిందని గుర్తుచేశారు.
JNU Sexual Harassment Case | మౌనంపై విమర్శలు..
తమ పార్టీకి చెందిన వ్యక్తిపై ఇంతటి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు, రుజువులు ఉన్నప్పటికీ… కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశంపై కనీసం నోరు మెదపకపోవడం అత్యంత బాధాకరమని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా భద్రత గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, వాస్తవానికి వచ్చేసరికి నిందితుడికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు.
JNU Sexual Harassment Case | ద్వంద్వ వైఖరికి నిదర్శనం..
నిందితుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కనీసం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం అంటే ఆ నేరస్తుడిని వారు కాపాడుతున్నట్లే అర్థమవుతోందని పురందేశ్వరి ఆరోపించారు. చేసిన దురాగతాలకు గాను సదరు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బహిష్కరించి ఉండాల్సిందని, అలా చేయకుండా రక్షణ కల్పించడం వారి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నిస్తూ, తక్షణమే నిందితుడిపై కఠినమైన చట్టపరమైన, రాజకీయ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు