అక్షరటుడే, కామారెడ్డి: Sharannavaratri Security | శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని (Kamareddy) దుర్గామాత మండపాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sharannavaratri Security | దసరా ఉత్సవాలకు..
జిల్లాలో దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, గణేష్ నవరాత్రుల మాదిరిగానే శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఊళ్లకు వెళ్లే ముందు పక్కవారికి సమాచారం ఇవ్వాలని, ఇంటి ముందు బట్టలు ఆరేసి వెళ్లాలని, లైట్ వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటివద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దుర్గామాత మండపాల వద్దకు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని, పోలీసులు సివిల్ డ్రెస్‌లో నిఘా వేస్తారని పేర్కొన్నారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెడతామని, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
Sharannavaratri Security | ఏటీఎం చోరీపై కొనసాగుతున్న విచారణ..
గాంధారి మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ ఘటనపై విచారణ కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. అర్ధరాత్రి తర్వాత బ్లాక్ స్కార్పియో వాహనంలో ముగ్గురు వ్యక్తులు నైటీలు ధరించి చోరీకి పాల్పడ్డారన్నారు. అంతకుముందు ఓ ఇంజినీరింగ్ షాపులో సిలిండర్ చోరీ చేసి దాని సాయంతో ఏటీఎంలో కట్టర్ ద్వారా చోరీ చేశారన్నారు. ఏటీఎం నుంచి రూ.25.45 లక్షల చోరీ జరిగిందని బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారన్నారు. ఏటీఎంలో అలారం సిస్టం పనిచేయకపోవడంతో చోరీ విషయం నాలుగు గంటలు ఆలస్యంగా తెలిసిందన్నారు. ఎస్బీఐ ఏటీఎంలు టార్గెట్గా చోరీలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన చోరీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, దీనిపై ఎస్బీఐ వారితో మాట్లాడతానన్నారు. కొన్ని ఏటీఎంల వద్ద సెక్యూరిటీ ఉండటం లేదన్నారు. ఇది బ్యాంకర్ల బాధ్యత అని తెలిపారు. ఏటీఎంల వద్ద పెట్రోలింగ్ పెంచుతామని ఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమి ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి