అక్షరటుడే వెబ్‌డెస్క్: Radial Road 2 Scam | తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపే పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ఆధ్వర్యంలో చేపట్టిన రూ. 3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సొంత ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం బాధాకరమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే ఈ దోపిడీ జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Radial Road 2 Scam | టెండర్లు రద్దు చేశారు..
ఈ ప్రాజెక్టులో మూడు ప్యాకేజీలకు సంబంధించి తమ కంపెనీ ఇతర సంస్థల కంటే రూ. 600 కోట్లు తక్కువ ధరకు టెండర్లు వేసినప్పటికీ, కావాలనే పక్కన పెట్టారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తమను అడ్డుకోవడానికి నిబంధనలు మార్చారని, ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ఆ ప్రజాధనాన్ని ఇతర రాష్ట్రాల వారికి పంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు పది రూపాయలు మిగిలితే చాలు, వంద రూపాయల లాభం అవసరం లేదని స్పష్టం చేశారు.
Radial Road 2 Scam | రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా..
ఈ టెండర్లు వేయొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా తనకు ఫోన్లు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ పోటీ టెండర్లు వేశామని, తన కంపెనీని డిస్‌క్వాలిఫై చేయడానికి అధికారులెవరు అని ప్రశ్నించారు. ఈ టెండర్ల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తానని తెలిపారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి కచ్చితంగా తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
Radial Road 2 Scam | సింగరేణి మూతపడే పరిస్థితి..
రాష్ట్రంలో ఈ మూడేళ్లలో పూర్తిగా అవినీతి పేరుకుపోయిందని, సింగరేణి సంస్థ కూడా మూతపడే ప్రమాదంలో ఉందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “దొరికింది దొరికినట్లు దోచుకుంటే ఎలా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా మాలాంటి వాళ్లు ఈ దోపిడీపై పోరాడుతాం” అన్నారు. రేవంత్ రెడ్డి చేసినా, రాజగోపాల్ రెడ్డి చేసినా తప్పు తప్పేనని, ఈ అవినీతి జరుగుతుంటే తాము ఢిల్లీ ర్యాలీలలో ఎలా పాల్గొంటామని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే ప్రజాధనం మరింత దుర్వినియోగం అవుతుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు