అక్షరటుడే వెబ్డెస్క్: KTR Telangana Water Crisis | రాష్ట్రంలో ఏర్పడిన నీటి ఎద్దడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ( Telangana )ఇప్పుడు కనిపిస్తున్నది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని, పాలకులు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల వచ్చిన ‘చేతకాని కరువు’ అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వం చూపించిన బాధ్యతారాహిత్యం వల్లే వందలాది టీఎంసీల ప్రాజెక్టు నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయాయని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Telangana Water Crisis | 1000 టీఎంసీల నీరు వృథా..
ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి ఇప్పటిదాకా దాదాపు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు, మరో 250 టీఎంసీల కృష్ణా నీళ్లు సముద్రం పాలు కావడం కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి, దేవాదుల లాంటి కీలకమైన పంపింగ్ స్టేషన్లను సరైన సమయంలో నడిపి ఉంటే, ఉత్తర తెలంగాణలోని రిజర్వాయర్లు, జలాశయాలన్నీ నీటితో కళకళలాడేవని పేర్కొన్నారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల విలువైన నీరు వృథాగా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Telangana Water Crisis | ముందస్తు ప్రణాళిక లేదు..
వాతావరణ నిపుణులు ముందే ‘ఎల్ నినో’ ప్రభావంతో కరువు ప్రమాదం ఉందని హెచ్చరించినా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని కేటీఆర్ మండిపడ్డారు. మనకు ఉపయోగపడాల్సిన నీటిని కాపాడుకోవడంలో విఫలమైన ప్రభుత్వం, పట్టిసీమ, పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా నీళ్లను ఏపీకి పారించిందని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలోని కుప్పం వరకు నీటిని తరలించుకుపోయేలా చేసి, తెలంగాణ హక్కులను, రైతుల ప్రయోజనాలను గాల్లోకి వదిలేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: Punganur Stone Attack | ఎంపీ కారుపై రాళ్ల దాడి.. పుంగనూరులో ఉద్రిక్తత