అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra Drought Relief | ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్ర (Maharashtra)లో కరువు తాండవం చేస్తోంది. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రైతులకు అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకు వచ్చారు. అక్టోబర్ నెలలోని ఓ రోజు జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాష్ట్ర పునరావాస, సహాయక శాఖ అక్టోబర్ 14న 305 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని రైతులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం పలు రాయితీలను కూడా ప్రకటించింది.
Maharashtra Drought Relief | విద్యుత్ బిల్లుల రాయితీలు
కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు భూమి శిస్తు నుంచి మినహాయింపు కల్పించారు. పంట రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తామని తెలిపారు. అంతేగాకుండా వ్యవసాయ రుణాల వసూళ్లను తక్షణమే నిలిపి వేస్తామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ బోరు మోటార్ల విద్యుత్ బిల్లుల విషయంలో ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల విద్యార్థులకు పరీక్షా రుసుములను రద్దు చేయనున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర రైతుల కోసం అధికారుల సంఘం తమ ఒక రోజు వేతనాన్ని కరువు సహాయ నిధికి జమ చేస్తున్నట్లు లేఖను సమర్పించింది. మరోవైపు ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్నారు. చిప్లున్-సంగమేశ్వర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శేఖర్ తన నెల వేతనాన్ని అందించారు. కాగా తెలంగాణలో సైతం పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Rajasthan Bus Accident | ఎక్స్ప్రెస్వేపై బస్సు బోల్తా.. 8 మంది మృతి