అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Roads | కామారెడ్డి పట్టణంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పట్టణంలో ఏ మూలకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికపై అధికారుల అలసత్వం, నాయకుల పట్టింపులేని తనం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ఆ రోడ్లపై వెళ్లినప్పుడల్లా తిట్టుకోవడం పరిపాటిగా మారింది. అయినా అధికారులకు, నాయకులకు చీమకుట్టినట్టుగా కూడా అనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
Kamareddy Roads | పదేళ్లయినా..
జిల్లా కేంద్రంగా ఏర్పడి పదేళ్లు దాటినా కామారెడ్డి (Kamareddy) రూపురేఖలు మారలేదు. పట్టణ అభివృద్ధి పేరుతో ఏటా రూ.కోట్లల్లో ఖర్చు చేస్తున్నట్లు కాగితాలపై లెక్కలు చెబుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి శూన్యం. వచ్చిన నిధులు ఏమవుతున్నాయన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని రోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ ఎన్నికలు రావడంతో ఆ నిధులు అటకెక్కాయన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొత్త ప్రతిపాదనలు పంపుతోందే తప్ప, పాత రోడ్లకు మరమ్మతులు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kamareddy Roads | ప్రధాన రహదారులపై గుంతలు..
పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు, దేవునిపల్లి రోడ్డు, గాంధీగంజ్, సిరిసిల్ల రోడ్డు, జన్మభూమి రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ రోడ్లపై మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు ఎక్కడ, గుంత ఎక్కడో తెలియని పరిస్థితి. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. ఆటోలు బోల్తా పడుతున్నాయి. రాత్రి వేళల్లో వీధి దీపాలు కూడా సరిగా లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోంది. కలెక్టరేట్ కు వెళ్లే ప్రధాన రహదారే ఇలా ఉంటే ఇక లోపలి కాలనీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
Kamareddy Roads | ప్యాచ్ వర్క్.. ప్యాచ్ వర్క్..
గుంతలు పడిన ప్రతిసారి అధికారులు చేసేది ఒక్కటే – మట్టి, కంకరతో ప్యాచ్ వర్క్. ఒక్క భారీ వర్షానికే ఆ ప్యాచ్ వర్క్ మొత్తం కొట్టుకుపోయి మళ్లీ మొదటికి వస్తోంది. శాశ్వతంగా సీసీ రోడ్లు, నాణ్యమైన బీటీ రోడ్లు వేయాలన్న ఆలోచన అధికారులకు లేకపోవడం శోచనీయం. మున్సిపాలిటీ చేస్తోందని ఆర్అండ్బీ, ఆర్అండ్బీ చేస్తోందని మున్సిపాలిటీ చెప్పుకుంటూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి. ఇద్దరి మధ్య సమన్వయం లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు వేయడం, రద్దు చేయడం తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
Kamareddy Roads | డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. ఇళ్లలోకి నీళ్లు
రోడ్లు ధ్వంసం కావడానికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడమే. పట్టణంలో డ్రైనేజీల్లో ఏళ్లుగా పూడికతీత పనులు చేయడం లేదు. ప్రధాన నాలాలు కబ్జాలకు గురై కుంచించుకుపోయాయి. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నిలిచిపోతోంది. మురుగునీరు, వర్షపు నీరు కలిసి రోడ్లపై చెరువులను తలపిస్తున్నాయి. ఆ నీరే నేరుగా పక్కనే ఉన్న ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరుతోంది. దుర్గంధంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు నిద్రమత్తు వీడటం లేదు.
Kamareddy Roads | అటకెక్కిన రోడ్ల వెడల్పు
కామారెడ్డి పట్టణంలో రహదారుల విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇదే అంశంపై గతంలో పొలిటికల్ వార్ కూడా కొనసాగింది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తండ్రి రహదారులు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని, జేసీబీలతో ఇళ్లను కూల్చడానికి సవాల్ విసురుకున్నారు. ఈ వివాదం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం ఆ వివాదం సద్దుమణగగా రహదారుల విస్తరణ అంశం కూడా పక్కదారి పట్టింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముందు తన ఇంటిని కూల్చేసి రోడ్డు విస్తరణ పనులు తన ఇంటి నుంచే ప్రారంభిస్తానని ప్రకటించడంతో పాటు ఇంటిని కూడా కూల్చేశారు. అయితే విస్తరణ మాత్రం జరగలేదు. పట్టణంలో రహదారుల విస్తరణ చేపడితే రోడ్లపైకి వచ్చిన అనేక ఇళ్లను కూల్చాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయంగా ఈ అంశం పలు పార్టీలకు ఇబ్బందికరంగా మారతాయని భావించి రహదారుల వెడల్పు జోలికి వెళ్లడం లేదన్న ప్రచారం సాగుతోంది.
Kamareddy Roads | పదేళ్ల అభివృద్ధి ఎక్కడ..?
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీలు గుప్పించే నాయకులు, గెలిచాక పట్టణం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శిస్తున్నారు. కోట్లాది నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయించి, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పెండింగ్ లో ఉన్న రోడ్ల వెడల్పు పనులను పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Road Accident | ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. మున్సిపల్ కార్మికుడి దుర్మరణం