అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Private STP Registration | హైదరాబాద్ జలమండలి (HMWSSB) పరిధిలోని అన్ని ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీలు) యాజమాన్యాలు అక్టోబర్ 25వ తేదీలోగా నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. సుమారు 600 ప్రైవేట్ ఎస్టీపీలు ఉన్నట్లు అంచనా కాగా, ఇప్పటివరకు కేవలం 61 ఎస్టీపీలు మాత్రమే జలమండలి వద్ద నమోదు చేసుకున్నాయని తెలిపారు.
అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని ఎస్టీపీలకుఈ నమోదు తప్పనిసరని జలమండలి ఎండీ తెలిపారు. ఎస్టీపీల సామర్థ్యం, రోజువారీ మురుగునీటి శుద్ధి పరిమాణం, శుద్ధి చేసిన నీటి వినియోగం, అందుబాటులో ఉన్న మిగులు నీటి వివరాలను సమీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.
Private STP Registration | శుద్ధి చేసిన నీటిని..
వేసవిలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఉద్యానవనాల నిర్వహణ తదితర తాగునీరు అవసరం లేని కార్యకలాపాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మిగులు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఎస్టీపీల యాజమాన్యాల జలమండలి వెబ్‌సైట్ https://hyderabadwater.dawc.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
దీనిని కూడా చదవండి : Drinking Water Wastage | తాగునీరు వృథా.. పబ్‌కు రూ.20 వేల ఫైన్