అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indalwai Toll Gate | ‘పనిచేస్తున్న స్టిక్కర్నూ చెడిపోయిందన్నారు.. రూ.300 కట్టి కొత్తది వేయించుకోమన్నారు.. నిలదీస్తే ఫోన్‌తో స్కాన్ చేసి గేట్ తీసేశారు!’ ఇటీవల ఓ బాధితుడికి ఎదురైన చేదు అనుభవం ఇది.
ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులను ఇందల్వాయి టోల్ గేట్ వద్ద సిబ్బంది వేధిస్తున్న తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Indalwai Toll Gate | అసలేం జరుగుతోంది..?
ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్ (Nizamabad), నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల ప్రజలు రాజధాని హైదరాబాద్ చేరుకోవాలంటే ఇందల్వాయి టోల్ గేట్ ప్రధాన మార్గం. నిత్యం వేలాది వాహనాలు, ముఖ్యంగా పండగ సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల వాహనాలు ఈ గేటు మీదుగానే వెళ్తాయి.
అయితే, ఇటీవల దసరా పండగ ముగించుకుని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక కుటుంబానికి ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఊహించని చుక్కలు కనిపించాయి.
కారు గేట్ ముందుకు రాగానే, ఏ గేట్‌లోనూ ఫాస్టాగ్ స్కాన్ కావడం లేదని సిబ్బంది చెప్పారు.
“మీ స్టిక్కర్ పాడైపోయింది, పక్కనే ఉన్న షాపునకు వెళ్లి రూ.300 పెట్టి కొత్త స్టిక్కర్ వేయించుకోండి.. లేదంటే నగదు రూపంలో టోల్ కట్టి వెళ్లండి” అని గదమాయించారు.
కుటుంబసమేతంగా ఉన్న వాహనదారులను సుమారు అరగంటపాటు రోడ్డుపైనే నిలబెట్టి మానసిక వేధింపులకు గురిచేశారు.
Indalwai Toll Gate | బాధితుల పోరాటం.. బయటపడ్డ అసలు నైజం!
సిబ్బంది బెదిరింపులకు వెరవని ఆ వాహనదారుడు నిలదీశాడు. “నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి ఇటు వస్తున్నప్పుడు సరిగ్గా పనిచేసిన స్టిక్కర్, ఇప్పుడు ఎలా పాడవుతుంది?” అని ప్రశ్నించాడు. అర్ధరాత్రి కావడంతో స్టిక్కర్ మార్చే షాపులు కూడా అందుబాటులో లేకపోవడంతో, వాహనాన్ని కదిలించేది లేదని పట్టుబట్టాడు.
వాహనదారుడి పట్టుదల చూసి వెనక్కి తగ్గిన టోల్ సిబ్బంది, చివరకు తమ చేతిలోని ఫోన్ ద్వారా ఫాస్టాగ్ స్మార్ట్ స్కానర్ ఉపయోగించి స్కాన్ చేయగా.. వెంటనే గేట్ ఓపెన్ అయింది!
Indalwai Toll Gate | ట్విస్ట్ ఇక్కడే ఉంది!
నిజంగానే ఫాస్టాగ్ స్టిక్కర్ పాడై ఉంటే.. ఆ తర్వాత వచ్చిన భిక్కనూర్, మనోహరాబాద్ టోల్ గేట్ల వద్ద కూడా అదే సమస్య రావాలి. కానీ, ఆ తర్వాత ఉన్న రెండు టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా అదే ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ అయింది! కారు వేగంగా ముందుకు సాగిపోయింది.
Indalwai Toll Gate | ఇది సిస్టమ్ లోపమా? ‘సైడ్ బిజినెస్’ మోసమా?
ఈ ఘటనాక్రమం చూస్తే ఇందల్వాయి టోల్ గేట్ వద్ద జరుగుతున్న అక్రమాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్కానర్ల లోపమా? కావాలని చేస్తున్న కుట్రనా?: టోల్ గేట్ ఆటోమేటిక్ స్కానర్లు సరిగ్గా పనిచేయడంలేదా? లేక సిబ్బందే కావాలని స్కానర్లను ఆపివేసి వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారా?
రూ.300 స్టిక్కర్ల దందా: స్టిక్కర్ పనిచేయడం లేదంటూ పక్కనే ఉన్న ప్రైవేట్ షాపుల వైపు పంపడం వెనుక భారీ కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.300 వసూలు చేస్తూ ప్రతిరోజూ వందలాది మందిని నిలువునా దోచేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అధికారుల మౌనం – అనుమానాల వ్యూహం: నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ జాతీయ రహదారిపై జరుగుతున్న ఈ ‘సైడ్ బిజినెస్’ స్థానిక పోలీసులకు, టోల్ ప్లాజా ఉన్నతాధికారులకు, రాజకీయనాయకులకు తెలియకుండా జరుగుతోందా? అనే ప్రశ్నలు బాధితుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఉత్తర తెలంగాణ నుంచి నిత్యం ప్రయాణించే వేలాది మంది ప్రజల పాలిట ఇందల్వాయి టోల్గేట్ ఒక ‘దోపిడీ కేంద్రం’గా మారకముందే సంబంధిత అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి స్కానర్లను తనిఖీ చేసి, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై, ప్రైవేట్ స్టిక్కర్ దందా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Armoor Open Gyms | నిర్వహణ లేక నిరుపయోగం.. ఓపెన్ జిమ్‌లపై నీలినీడలు