అక్షరటుడే, ఆర్మూర్: Armoor Open Gyms | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు ఆలనాపాలనా లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఏర్పాటు చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం, నిర్వహణ విషయంలో కనిపించకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని పట్టణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Armoor Open Gyms | ఆర్మూర్ మున్సిపాలిటీలో..
ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality) పరిధిలో కొత్తగా ఏర్పడిన లేఅవుట్లలో నిబంధనల ప్రకారం కేటాయించిన 10 శాతం ఖాళీ స్థలాల్లో ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, పెర్కిట్, మామిడిపల్లి, కోటార్మూర్, రాజారాం నగర్ , జర్నలిస్ట్ కాలనీ, విద్యానగర్, జిరాయత్ నగర్, మినీ స్టేడియం తదితర కాలనీల్లో ఒక్కోచోట రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి సైక్లింగ్, క్రాస్ ట్రైనర్, లెగ్ ప్రెస్, ఛెస్ట్ ప్రెస్, షోల్డర్ వీల్ వంటి ఆధునిక వ్యాయామ పరికరాలను అమర్చారు.
Armoor Open Gyms | కొన్నినెలలకే..
అయితే ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే ఈ జిమ్‌లు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించకపోవడం, కనీసం నెలకోసారైనా మరమ్మతులు చేయకపోవడంతో పరికరాలు తుప్పుపట్టి పోతున్నాయి. పలుచోట్ల సీట్లు విరిగిపోయాయి, నట్లు-బోల్టులు ఊడిపోయాయి, గొలుసులు తెగిపోయాయి. దీంతో వ్యాయామం చేయాలని వచ్చే వృద్ధులు, యువకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొన్ని చోట్ల జిమ్‌ల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోయి చెత్తాచెదారం పేరుకుపోయింది. రాత్రివేళ కనీస లైటింగ్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఈ ప్రదేశాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Armoor Open Gyms | నాసిరకం పరికరాలే కారణమా..

కాంట్రాక్టర్లు నాసిరకం పరికరాలను అమర్చినా, అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి మరమ్మతుతో బాగయ్యే పరికరాలు సైతం అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా పాడైపోయాయని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజున ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఏ ఒక్క అధికారి కూడా ఈ జిమ్‌ల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజల ఆరోగ్యం కోసం పెట్టిన జిమ్‌లు ఇప్పుడు ప్రజలకే ప్రమాదకరంగా మారాయని కాలనీవాసులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, పట్టణంలోని అన్ని ఓపెన్ జిమ్‌లపై సమగ్ర సర్వే నిర్వహించి, శిథిలమైన పరికరాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని, వాటి నిర్వహణ బాధ్యతను సంబంధిత కాలనీ సంక్షేమ సంఘాలకు, ప్రత్యేక సిబ్బందికి అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Elderly Woman Robbery | వృద్ధురాలిపై దాడి చేసి చోరీ.. నిందితుడి అరెస్ట్