అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Home Department | హోం (ఓపీ) శాఖలో అధికారాల వికేంద్రీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోం శాఖ పరిధిలోని కొన్ని పరిపాలనా అధికారాలను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Metro Viral Book | ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. మెట్రోలో పుస్తకం చూసి నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!
Telangana Home Department | ఇకపై హోంశాఖ ముఖ్య కార్యదర్శే నేరుగా..
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఆర్.టి. నెం.516 (తేదీ: 03-07-2026) ప్రకారం, తెలంగాణ ప్రభుత్వ వ్యాపార నియమావళి (Telangana Government Business Rules)లోని రూల్ 22(ఎ) కింద ఉన్న అధికారాలను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి బదలాయించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి కంటే దిగువ హోదా పోలీసు అధికారులు, అలాగే హోం శాఖ పరిపాలనా నియంత్రణలోని సమాన హోదా నాన్-పోలీస్ అధికారులపై విధించిన శిక్షలకు సంబంధించిన అప్పీల్, రివ్యూ, రివిజన్ పిటిషన్లను ఇకపై హోంశాఖ ముఖ్య కార్యదర్శే పరిష్కరించనున్నారు.
Telangana Home Department | పిటిషన్ల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం
ఇప్పటివరకు ఈ అంశాల్లో ప్రభుత్వం స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులతో ఆ అధికారాలను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. దీంతో అప్పీళ్లు, రివ్యూ, రివిజన్ పిటిషన్ల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు హోం (ఓపీ) శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా శాఖలో పరిపాలనా వికేంద్రీకరణకు ఊతమివ్వడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను సరళీకృతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.