అక్షరటుడే వెబ్‌డెస్క్: PNB Bank Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గ్రేటర్ నోయిడా ( Noida )ఐచ్చర్ శాఖలో రూ.35 కోట్ల భారీ స్కామ్ వెలుగుచూసింది. తమ ఖాతాల్లో డబ్బులు డ్రా చేయడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేయడానికి వెళ్లిన వినియోగదారులకు అకౌంట్లు ఖాళీగా కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. సేవింగ్స్ అకౌంట్లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ప్రీ-మెచ్యూర్ చేసి నగదు మళ్లించినట్లు గుర్తించారు. ఎలాంటి మెసేజ్ అలర్టులు రాకపోవడం, డబ్బు బదిలీ పత్రాలపై సంతకాలు చేయకపోవడంతో ఈ ఘటన వెనుక అంతర్గత హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
PNB Bank Scam రైతుల నష్టపరిహారమే..
ఈ కుంభకోణంలో ప్రధానంగా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం , ఇతర భూసేకరణ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన రైతులు, సాధారణ ప్రజల ఖాతాలనే లక్ష్యంగా చేసుకున్నారు.
సంతోష్: విమానాశ్రయ భూ పరిహారంగా వచ్చిన రూ.1.29 కోట్లలో ఏకంగా రూ.1.18 కోట్లు మాయమైపోగా, కుటుంబం జీవితాంతం దాచుకున్న సొమ్మును కోల్పోయి రోడ్డున పడింది.
హనీఫ్ ఖాన్: తన ఖాతాలోని రూ.39 లక్షలు మాయమై, బ్యాలెన్స్ ప్రస్తుతం సున్నాగా మారింది.
విజేంద్ర సింగ్: రూ.88 లక్షలు దాచుకున్న రైతు ఖాతాలో ఇప్పుడు కేవలం రూ.1 లక్ష మాత్రమే మిగిలింది.
PNB Bank Scam | మేనేజర్ సహా ఐదుగురి సస్పెన్షన్..
ఈ ఉదంతంపై బాధితులు పెద్దఎత్తున నిరసన చేపట్టడంతో స్పందించిన పీఎన్‌బీ ఉన్నతాధికారులు శాఖ మేనేజర్ సహా ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ పూర్తి చేసి వారం నుంచి 15 రోజుల్లోగా డిపాజిటర్ల డబ్బులు తిరిగి చెల్లిస్తామని బ్యాంక్ యాజమాన్యం హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Ration Rice Mafia | రేషన్ బియ్యం పాలిష్ చేసి.. కిలో రూ.80కి విక్రయం