CMR Rice Mill Scam | సీఎంఆర్​ బాగోతంపై సీఐడీ డేగకన్ను.. ఆధారాలతో రైస్​మిల్లులపై దాడులు

సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లుపై సీఐడీ అధికారులు కొరడా ఝులిపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: CMR Rice Mill Scam | రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం.. మిల్లులకు చేరుతోంది. అక్కడి నుంచి బియ్యంగా మారి తిరిగి ప్రభుత్వానికి చేరాల్సి ఉంది. కానీ ఈ లావాదేవీల్లో ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో తాజాగా జిల్లాలో (Nizamabad) సీఐడీ (CID) అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా 16మంది రైస్​మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. ఈ భయంలో ఇద్దరు మిల్లర్లు పరారీలో ఉండగా.. 14మందిని రిమాండ్​ నుంచి కస్టడీకి తీసుకుని సీఎంఆర్​పై విచారిస్తున్నారు.

CMR Rice Mill Scam | పదేళ్ల బకాయిలకు పరిష్కారం ఏది?

సీఎంఆర్‌ బకాయిల సమస్య ఇప్పటిది కాదు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 494 మంది మిల్లర్ల నుంచి 2.22 లక్షల టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం రావాల్సి ఉన్నట్లు 2023లోనే వెల్లడైంది. బకాయిలు అధికంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్‌ కూడా ఉంది. అప్పట్లోనే వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయినా సమస్య పూర్తిగా పరిష్కారమైన దాఖలాలు కనిపించడం లేదు.

CMR Rice Mill Scam | 90 రోజులు గడువుచ్చినా..

మరోవైపు 2014-15 నుంచి 2023-24 వరకు వివిధ సీజన్లలో బకాయిపడిన మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ బియ్యాన్ని వసూలు చేసేందుకు 2025 నవంబరు 24న ప్రభుత్వం ప్రత్యేక మెమో జారీ చేసింది. 90 రోజుల్లోగా బకాయి బియ్యం అందించాలని లేదా బకాయి విలువలో 125 శాతాన్ని జరిమానా, 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2026 మార్చిలోనూ ఈ అంశంపై గడువు పొడిగింపునకు సంబంధించిన పరిణామాలు హైకోర్టు కేసుల్లో ప్రస్తావనకు వచ్చాయి. అంటే పాత బకాయిల వసూలు ప్రక్రియ ఎంతకాలంగా సాగుతోందో అర్థమవుతోంది.

CMR Rice Mill Scam | లెక్కల్లో ధాన్యం.. క్షేత్రస్థాయిలో కొరత

నిజామాబాద్‌ జిల్లాలో సీఐడీ విచారణలోనూ నిల్వల వ్యత్యాసాలు బయటపడ్డాయి. కేసు డైరీ ప్రకారం 16 రైస్‌ మిల్లుల్లో తనిఖీలు చేయగా తొమ్మిది మిల్లుల్లో 2,460.531 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత గుర్తించారు. మరోవైపు ఆరు మిల్లులు 667 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యానికి బదులుగా దొడ్డు రకం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందువల్ల ప్రభుత్వానికి సుమారు రూ.67 లక్షల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

CMR Rice Mill Scam | నాణ్యత మార్చి..

సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం ప్రత్యేక బోనస్‌తో కొనుగోలు చేసి మిల్లులకు కేటాయించింది. ఒప్పందం ప్రకారం అదే రకం బియ్యాన్ని తిరిగి అందించాలి. అయితే సన్నరకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి, తక్కువ ధరకు లభించే దొడ్డు రకం బియ్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు సీఐడీ దర్యాప్తులో గుర్తించారు. కొన్ని చోట్ల ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేసినట్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. అంటే ధాన్యం నిల్వలకే కాకుండా బియ్యం నాణ్యత, రకం నిర్ధారణలోనూ పర్యవేక్షణ అవసరమనే విషయం స్పష్టమవుతోంది.

పాత బకాయిల సంగతేంటి?

ఇక్కడే కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. గత సీజన్లలో బకాయిలు ఉన్న మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బకాయి ఉన్నప్పటికీ తదుపరి సీజన్లలో వారికి ధాన్యం కేటాయించారా? కేటాయించినట్లయితే ఏ నిబంధనల ప్రకారం అనుమతించారు? మిల్లుల్లో ఉన్న నిల్వలను ఎప్పటికప్పుడు భౌతికంగా తనిఖీ చేశారా? బకాయిలకు గడువు పొడిగించిన తర్వాత ఎంతమేర బియ్యం తిరిగి వచ్చింది? ఎంత మొత్తం వసూలైంది? ఈ వివరాలన్నింటినీ వెల్లడించాల్సిన అవసరం ఉంది.

అధికారుల పాత్రపై అనుమానాలు..

ప్రభుత్వ ధాన్యం అప్పగించినప్పటి నుంచి బియ్యం తిరిగి స్వీకరించే వరకు ప్రతి దశలో అధికారుల వద్ద రికార్డులు ఉంటాయి. ధాన్యం కేటాయింపు, మిల్లులో నిల్వ, మిల్లింగ్‌, బియ్యం రవాణా, ఎఫ్‌సీఐ గోదాముల్లో స్వీకరణ.. ఇలా ప్రతి దశకు సంబంధించిన లెక్కలను సరిపోల్చితేనే అసలు లోపం ఎక్కడ జరిగిందో తేలుతుంది. తాజా సీఐడీ దర్యాప్తులో అధికారుల పాత్రపైనా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై సమగ్ర పరిశీలన అవసరం. మిల్లర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు గత సీజన్ల బకాయిల లెక్కలను బహిర్గతం చేసి, వసూళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి : కూతురి స్కూల్ కోసం.. రోడ్డునే మారుస్తారా రేవంత్…?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *