Telangana Congress Dispute | రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వివాదం.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదిరేనా..?

మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య వివాదం ఇంకా ఎటు తేలలేదు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Telangana Congress Dispute | మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య కొనసాగుతున్న ఢిల్లీ పంచాయితీ ఇంకా ఎటు తేలలేదు. ఇరువురు నేతల మధ్య రాజీకి ప్రయత్నాలు జరిగినా అనుకున్న స్థాయిలో సఫలం కాలేదన్న టాక్ వినిపిస్తోంది.

Telangana Congress Dispute | గాంధీ భవన్​కు ఎవరూ రాకపాయే..

గాంధీ భవన్ వేదికగా ఇరువురి మధ్య వివాదానికి చెక్ పెడతారని ప్రచారం సాగినప్పటికీ గైర్హాజరు కావడంతో అదికూడా అటకెక్కింది. దాంతో ప్రస్తుతం ఇద్దరి మధ్య వివాదం అధిష్ఠానం చెంతకు చేరబోతుందనే ప్రచారం సాగుతోంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ పంచాయితీ ఎటు తేలకపోవడంతో ఇప్పుడు పార్టీ అధిష్ఠానం చెంతకు చేరింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా నవంబర్ 1న షాంగ్రీ-లా హోటల్ లాబీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం, ఇతర పార్టీ పదవుల విషయంలోనే ఈ గొడవ మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వివాదం ఇంకా ముగియకపోవడంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది.

Telangana Congress Dispute | కుటుంబాన్ని సైతం బెదిరించాడని..

ఢిల్లీలో మంత్రి తనను దూషించి, గదిలోకి తీసుకెళ్లి కొడతానని, కుటుంబాన్ని కూడా బెదిరించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు ఆరోపిస్తున్నట్టుగా ప్రచారం సాగింది. అయితే మంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం వివాదమే లేదని, ఇది ఇసుక రీచ్‌ల పంచాయితీ కాదని ఖండిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ తమ వైఖరిలో మార్పు లేకుండా ఉండటంతో సయోధ్య కుదరడం కష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఇద్దరినీ పిలిచి నచ్చజెప్పాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Telangana Congress Dispute | వారం రోజులుగా తేలని వివాదం

వివాదానికి మూలం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం, ఇతర పార్టీ పదవుల విషయంలోనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే తన స్వస్థలం నారాయణఖేడ్‌కు చెందిన నేతకు డీసీసీ పదవి విషయంలో మద్దతు తెలపడాన్ని మంత్రి తప్పుపట్టినట్లు ప్రచారం సాగింది. మరోవైపు జుక్కల్‌లో ఇసుక మైనింగ్ విషయంలోనే అసలు వివాదం మొదలైందని కూడా ప్రచారం జరుగుతోంది. మంత్రి సోదరుడికి ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ఎమ్మెల్యే నిరాకరించడంతోనే విభేదాలు తలెత్తాయని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. వారం రోజులు గడిచినా ఇరువర్గాల్లో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో పంచాయితీ ఎటు తేలడం లేదు.

Telangana Congress Dispute | అధిష్టానం చెంతకు చేరిన పంచాయతీ..?

ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో గురువారం ఇద్దరినీ విడివిడిగా పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే మంత్రి చివరి నిమిషంలో రాలేనని చెప్పడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఎమ్మెల్యేతో జరగాల్సిన భేటీ కూడా రద్దయింది. పార్టీ పిలుపును సైతం ఖాతరు చేయకపోవడంతో పీసీసీ చీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ఇద్దరి వ్యవహారశైలిపై సమగ్ర నివేదిక రూపొందించి అధిష్ఠానానికి పంపించినట్లు సమాచారం. దాంతో ఇరువురి పంచాయతీ ఇప్పుడు అధిష్ఠానం చెంతకు చేరుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Telangana Congress Dispute | ముగింపా..? చర్యలా..?

ఎమ్మెల్యే, మంత్రి మధ్య వివాదం ఇప్పుడు బాల్ అధిష్ఠానం కోర్టులో ఉంది. ఎమ్మెల్యే ఇప్పటికే అధిష్టనానికి లేఖ రాశారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కూడా వెళ్తానని చెప్పారు. అయితే ఈ వివాదాన్ని అధిష్టానం ముగిస్తుందా..? చర్యలకు సిద్ధమవుతుందా..? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కాంగ్రెస్‌లో ఇలాంటి వివాదాల్లో అధిష్ఠానం ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి సయోధ్య కుదిర్చే అవకాశమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Village Development  | పోచారం గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్ల నిధులు..: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *