Cold Weather in Nizamabad | గజగజ వణికిస్తోన్న చలి.. సాయంత్రమైతే ముసుగేయాల్సిందే..

చలి పులి పంజా విసురుతోంది. సాయంత్రానికే వాతావరణంలో మార్పు కనిపిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Cold Weather in Nizamabad | చలి పులి పంజా విసురుతోంది. సాయంత్రానికే వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయానికి చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుంటుండగా.. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువవుతోంది.

Cold Weather in Nizamabad | ఉమ్మడిజిల్లాలో..

నిజామాబాద్‌ (Nizamabad), కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Cold Weather in Nizamabad | ఐదు రోజుల ఉష్ణోగ్రతల సరళి

నవంబరు 4 నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈనెల 4న 21.9 డిగ్రీలు ఉండగా.. 5వ తేదీన 22.1 డిగ్రీలు ఉంది. 6వ తేదీన 23 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. 7వ తేదీన 20.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాగే 8వ తేదీన ఒక్కసారిగి ఉష్ణోగ్రత పడిపోయింది. 18.7డిగ్రీలుగా నమోదైంది.

Cold Weather in Nizamabad | 14.8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

రెండు జిల్లాల్లోని ప్రతి ప్రాంతంలో 14.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నవంబరు 9 ఉదయం వరకు నమోదైన తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ గణాంకాల ప్రకారం కామారెడ్డిలో 14.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నవంబరు 10న విడుదల చేసిన నివేదికలో నిజామాబాద్‌ స్టేషన్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలుగా పేర్కొంది.

Cold Weather in Nizamabad | సాయంత్రం నుంచే చలి ప్రభావం

పగటిపూట ఎండ ఉంటున్నప్పటికీ.. సూర్యాస్తమయం తర్వాత వాతావరణం చల్లబడుతోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత బయటకు వెళ్లేవారు స్వెటర్లు, జర్కిన్లు ధరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 9 గంటల తర్వాత, తెల్లవారుజామున చలి మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పొగమంచు కారణంగా రహదారులపై దూరం నుంచి వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు కూడా చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

Cold Weather in Nizamabad | తీసుకోవాల్సిన జాగ్రత్తలు

– వృద్ధులు, చిన్నారులు ఉదయం, రాత్రి వేళల్లో వెచ్చని దుస్తులు ధరించాలి.
– అవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు వెళ్లకుండా ఉండాలి.
– ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌తో పాటు శరీరాన్ని కప్పే దుస్తులు ధరించాలి.
– పొగమంచు సమయంలో వాహనాల వేగాన్ని తగ్గించి, లైట్లు వెలిగించాలి.
– చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
– వృద్ధులు, చిన్నారులు చలి కారణంగా అనారోగ్యానికి గురైతే వైద్యులను సంప్రదించాలి.
– గదులను వేడిగా ఉంచేందుకు బొగ్గు, కట్టెలను మండిస్తూ పూర్తిగా మూసివేసిన గదుల్లో నిద్రించకూడదు.

Cold Weather in Nizamabad | ముందస్తు అంచనాలపై దృష్టి

నవంబరు 10వ తేదీకి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నిజామాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల చుట్టూ, కామారెడ్డిలో 14 డిగ్రీల చుట్టూ ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల మార్పులపై ప్రజలు దృష్టి సారించాలి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు, సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఇది కూడా చదవండి..: Induru Stadium | ఇందూరులో స్టేడియం నిర్మాణమే నా లక్ష్యం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *