అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Graduate MLC Elections | అధికార పక్షాన్ని, నిద్రలో ఉన్న ప్రతిపక్షాలను ప్రశ్నించడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అద్భుతమైన అవకాశమని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )అన్నారు. బంజారాహిల్స్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వీర తిలకం దిద్దడం ద్వారా ఆమె అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో డిగ్రీ అర్హత ఉన్న వారు సుమారు 80 లక్షల మంది ఉన్నారని, ప్రస్తుతం 75 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Telangana Graduate MLC Elections | కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం..
శాసనసభతో పాటు శాసనమండలిలోనూ కాంగ్రెస్ బలమే ఎక్కువగా ఉందని, బీఆర్ఎస్ నుంచి గెలిచిన సగం మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లారని కవిత ఆరోపించారు. బీజేపీతో వారికి లోపాయికారీ ఒప్పందం ఉందని, మండలిలో అసలు ప్రతిపక్షమే లేకుండా పోయిందని విమర్శించారు. మూడుసార్లు గెలిపించినా ప్రజలకు ఏమీ చేయని బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేవలం డబ్బుల బలంతోనే గెలవాలని ప్రభుత్వం చూస్తోందని, రూ.200 కోట్లు ఖర్చు పెట్టియినా అభ్యర్థులను గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, నదీ జలాల పరిరక్షణ వంటి ప్రజా సమస్యలపై తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Telangana Graduate MLC Elections | బీసీ అభ్యర్థులకు పెద్దపీట..
సామాజిక తెలంగాణను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత పేర్కొన్నారు. తాము ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు కూడా బీసీ వర్గానికి చెందినవారేనని, వారిలో ఒకరు కాకతీయ, మరొకరు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని తెలిపారు. కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఆకాశ్ కొల్లూరికి అభ్యర్థిత్వం ఖరారు చేశామని, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వర్గానికి ఈ స్థాయి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజకీయ నేపథ్యం లేని, సాధారణ చదువుకున్న యువతకు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. జనరల్ స్థానాల్లో కూడా మహిళలకు 30 నుంచి 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
Telangana Graduate MLC Elections | ఈసీ వద్ద పార్టీ గుర్తింపు..
ఎన్నికల సంఘం (EC) వద్ద తమ పార్టీకి గుర్తింపు లభించిందని, మిగిలిన ప్రక్రియపై తమ న్యాయవాదులు ఈసీ అధికారులతో చర్చిస్తున్నారని కవిత వెల్లడించారు. తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన అన్ని పార్టీల మద్దతు కోరుతామని, పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Air India Hijack Threat | ఎయిరిండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్